వెంటాడుతున్న ఇంధన కష్టాలు | - | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న ఇంధన కష్టాలు

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

భయపెడుతున్న నో స్టాక్‌ బోర్డులు

ఇంధన కొరతతో వాహనదారుల

ఆందోళన

నంద్యాల(అర్బన్‌)/కోవెలకుంట్ల: వారం రోజులుగా జిల్లాలో ఇంధన కొరతతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరత తీవ్రతరం అవుతుందని తెలుసుకున్న కొంత మంది ముందస్తుగా క్యాన్లు, బాటిళ్లలో నిల్వ చేసుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. ఇంధనం పూర్తి స్థాయిలో కొరత ఏర్పడటంతో వాహన దారులు, రైతులు అసవ్థలు పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పెట్రోల్‌ కొరత లేదంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందు కోసం పంపుల యజమానులతో సమీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. అయితే కొరత తీవ్రతరం అవుతుండటంతో కొందరు వాహన దారులు బ్లాక్‌లో ఎక్కువ మొత్తం చెల్లించి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రం నంద్యాలలో ఏ బంకు ఎప్పుడు మూత బడుతోందో, మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో నాలుగు రోజుల నుంచి వాహన చోదకులు పెట్రోల్‌, డీజిల్‌ దొరక్క ఇక్కట్లు పడుతున్నారు. కోవెలకుంట్ల పట్టణంలో ఎనిమిది పెట్రోల్‌ బంకులు ఉండగా ఏడు బంకులు మూత పడగా శనివారం ఒక బంకు వద్ద ఇంధనం కోసం వాహనాలు బారులు తీరాయి. గతంలో పెట్రోల్‌ బంకు యాజమాన్యం ఇంధనం సప్లై వచ్చాక డబ్బులు చెల్లించేవారు. ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో ఇంధన సరఫరాకు ముందుగానే జీఎస్టీతో కలుపుకుని డీడీ తీయాల్సి ఉండటంతో ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. అరకొరగా సరఫరా అవుతున్న బంకు వద్ద వాహనదారులు బైక్‌లు, కార్ల ట్యాంకులను ఫుల్‌ చేయించుకుంటున్నారు. కోవెలకుంట్ల పరిసర ప్రాంత ప్రజలే కాకుండా చుట్టు పక్కల మండలాలకు చెందిన వాహనదారులు తరలి రావడంతో బంకుల వద్ద వాహనాలు బారులుదీరాయి.

వరి కోతలపై ప్రభావం..

పాణ్యం: డీజిల్‌ అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో సాగు చేసిన వరి పైర్లు కోతకు వచ్చాయి. దీంతో రైతులు వరి కోతకు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. అయితే డీజిల్‌ కొరత కారణంగా యంత్రాలు పొలాల్లోకి వెళ్లడం లేదు. కోతలు ఆలస్యం అవుతుండటంతో రైతులను భయం వెంటాడుతోంది. అకాల వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట దెబ్బతినే ప్రమాదం ఉండటంతో వెంటనే పంటను ఇంటికి చేర్చాలని భావిస్తున్నారు. రైతులు, వరికోత మిషన్‌ ఆపరేటర్లు క్యాన్లు, డ్రమ్ములతో పెట్రోల్‌ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు రవాణా రంగంపై కూడా ప్రభావం చూపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement