● అధిక ఉష్ణోగ్రతలకు ఎండిపోతున్న అరటిచెట్లు
కొలిమిగుండ్ల: లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన అరటి రైతులకు చివరకు నష్టాలే మిగులుతున్నాయి. ఓవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎగుమతులు పూర్తిగా తగ్గి కొనేవారే కరువయ్యారు. మరో వైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా గెలలు చెట్ల పైనే ఎండిపోతున్నాయి. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. మండలంలో మదనంతపురం, అబ్దులాపురం, కోర్నపల్లె, చింతలాయిపల్లె, ఇటిక్యాల, తదితర గ్రామాల్లో 500 ఎకరాల మేర అరటి సాగు చేశారు. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టారు. యుద్ధ పరిస్థితులు, రవాణా సమస్యల వల్ల అరటి ఎగుమతులు ఆగిపోయాయి. మార్కెట్‌లో ధరలు పూర్తిగా తగ్గు ముఖం పట్టాయి. స్థానికంగా కోల్డ్ స్టోరేజ్ లేక నిల్వ చేసుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఉష్ణోగ్రతల దాటికి అరటి చెట్లు గెలలతో సహా నిలువునా కూలిపోతున్నాయి. కొందరు రైతులు చేసేది లేక అరటి గెలలను పశువులకు మేతగా వేస్తుండగా మరి కొందరు తోటల్లోనే పక్కకు పడేస్తున్నారు. కొత్తగా అరటి మొక్కలు నాటుకున్న పలువురు రైతులు ఎండల ప్రభావంతో ఎండిపోకుండా పేపర్లు, ఈత ఆకులను రక్షణగా పెట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎండలు పెరుగుతుండటంతో అరటి చెట్లు పూర్తిగా నేలకొరిగే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.


