బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు
నంద్యాల (వ్యవసాయం): బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని అన్నారు. మంగళవారం ఎస్పీజీ పాఠశాల ఆవరణలోని బాలికల జూనియర్ కళాశాలలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. బాల్యవివాహాలు సమాజానికి శాపమని, వీటి వలన బాలికల ఆరోగ్యం, విద్య, వ్యక్తిగత స్వాతంత్య్రంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. అదే విధంగా విద్యా ర్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మైనర్లు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం, ఆర్థిక నష్టాలపై అవగాహన కల్పించారు. మొక్కలు నాటి వాతావరణం కాలుష్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్ న్యాయవాది దాసరి రవి, సామాజికవేత్త రవికుమార్, మండల లీగల్ సెల్ సిబ్బంది భాస్కర్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


