శివభక్తి..దీక్షతో ముక్తి! | - | Sakshi
Sakshi News home page

శివభక్తి..దీక్షతో ముక్తి!

Jan 8 2026 9:19 AM | Updated on Jan 8 2026 9:19 AM

శివభక్తి..దీక్షతో ముక్తి!

శివభక్తి..దీక్షతో ముక్తి!

నేటి నుంచి శివమాల మండల దీక్ష స్వీకరణలు ప్రారంభం

41రోజుల పాటు మండలం, 21రోజుల పాటు అర్ధమండలం

దీక్ష పూర్తి తరువాత శివయ్యకు ఇరుముడి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షలకుపైగా భక్తులు దీక్ష స్వీకరణ

శివస్వాములకు శ్రీశైల దేవస్థానం సహకారం

శ్రీశైలంటెంపుల్‌: భక్తి మార్గంలో ఒక ముఖ్యమైన సాధనం శివదీక్ష. ఈ దీక్ష ద్వారా శివుడి అనుగ్రహం పొందడంతో పాటు సకల పాపాలు హరించబడతాయని భక్తుల విశ్వాసం. దీంతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పరమేశ్వరుడి భక్తులు శివదీక్ష చేపడుతారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈదీక్షను ఉభయ తెలుగురాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు స్వీకరిస్తారు. అత్యంత నియమ నిష్టలతో ఈ దీక్షలు సాగుతాయి.

1994సంవత్సరంలో అప్పటి శ్రీశైల దేవస్థాన ఈఓ వంగాల శివరామిరెడ్డి శివదీక్షను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. మొట్టమొదటిసారిగా ఆయనే స్వయంగా ఈ దీక్షను స్వీకరించారు. తర్వాత దీక్ష ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో క్రమంగా దీక్షపరులు పెరుగుతూ వచ్చారు. నేడు ఈ సంఖ్య 5లక్షలకు పైగా చేరిందని శ్రీశైలదేవస్థానం అధికారులు తెలిపారు.

41రోజుల పాటు దీక్ష:

శివదీక్షను 41రోజుల పాటు మండలం, 21రోజుల పాటు అర్ధ మండలం దీక్షను స్వీకరిస్తారు. గురువారం నుంచి శివదీక్షలు ప్రారంభం కానున్నాయి. మండల (41రోజుల)దీక్షను స్వీకరించే భక్తులు గురువారం నుంచి, జనవరి 28న అర్థమండల (21రోజుల)దీక్షను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 17న శివదీక్షను విరమిస్తారు. కొంత మంది భక్తులు ప్రస్తుతం 11రోజుల పాటు కూడా దీక్షను స్వీకరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినానికి 41 రోజులు పూర్తయ్యేలా దీక్షను స్వీకరిస్తారు. అలాగే కార్తీకమాసం నుంచి 108 రోజుల పాటు అఖండదీక్ష స్వీకరిస్తారు. 41రోజుల పాటు దీక్ష పూర్తయిన తరువాత ఇరుముడి సమర్పిస్తారు.

ఇరుముడి సమర్పణ

శివదీక్ష పూర్తయ్యే రోజున ఇరుముడితో శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరుకుంటారు. ఎక్కువ మంది శివస్వాములు పాదయాత్రగా వెళ్తుంటారు. గోధుమ వర్ణం సంచిలో స్వామి అమ్మవారికి నివేధించేందుకు పూజా సామగ్రి, నైవేద్యం ఇరుముడిగా తీసుకువెళతారు. స్వామివారికి ఇరుముడి సమర్పించిన తరువాత మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజలు అనంతరం శివదీక్షను విరమిస్తారు.

శివస్వాములకు దేవస్థానం సహకారం

శివమాల ధరించి శ్రీశైలం చేరుకున్న శివస్వాములకు శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సహకారాలు అందిస్తుంది. ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసి శివరాత్రి రెండు రోజుల ముందు వరకు మల్లన్న లింగ (స్పర్శ) దర్శనం కల్పిస్తుంది. అలాగే శివమాల విరమణకు శివదీక్షశిబిరాల వద్ద ప్రత్యేకంగా అర్చకులను ఏర్పాటు చేసి, హోమగుండాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా శివదీక్ష భక్తులకు తాగునీరు, భోజనం, స్నానాదికాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement