వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
కోవెలకుంట్ల: పొగాకు సాగు రెండేళ్ల నుంచి రైతులకు కలసి రావడం లేదు. గతేడాది వర్షాభావం, అధిక వర్షాలు, చీడపీడలతో తీవ్ర నష్టాలు వచ్చాయి. నష్టాన్ని పూడ్చుకుందామని ఈ ఏడాది మళ్లీ చేసిన సాగు నిరాశ మిగిల్చింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 3,371 హెక్టార్లలో పొగాకు సాగు కావాల్సి ఉంది. అయితే 1,329 హెక్టార్లలో మాత్రమే సాగు చేయగలిగారు. నాట్లు వేసిన తర్వాత వివిధ దశల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియడంతో నష్టాలు తప్పడం లేదు.
పెరిగిన పెట్టుబడులు
రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రైతులు రూ. 30 వేలు వెచ్చించారు. వర్షాలు అధికం కావడంతో పైరులో కలుపు విపరీతంగా పెరిగిపోవడంతో కలుపు తొలగించేందుకు ఎకరాకు రూ. 10 వేలు భారం పడింది. అధిక తేమ శాతం కారణంగా పైరును నీటికుట్టు తెగులు ఆశించి ఎదుగుదల నిలిచిపోయింది. దీనికి తోడు ఎండు తెగులు ఆశించి అరకొగా ఉన్న ఆకులు ఎండిపోతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
క్వింటాకు రూ. 20 వేలు ధర ఇవ్వాలి
చీడపీడల కారణంగా ఎకరాకు 3 క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే సూచనలు లేవని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పెట్టుబడుల రూపంలో వేలాది రూపాయాలు వెచ్చించామని, రాబోయే రోజుల్లో ఆకు కొట్టడం, తోరణాలు కుట్టడం, పందిర్లపై ఆరబెట్టుకోవడం, కొనుగోలు కేంద్రాలకు తరలించడం వంటి పనులకు ఎకరాకు మరో రూ. 15 వేలు భారం పడనుందని ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలు, తెగుళ్లతో పొగాకు దెబ్బతినిందని, క్వింటాకు రూ. 20 వేలు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా..
ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పొగాకు కంపెనీలు క్వింటాకు రూ. 18,500 ధర చెల్లిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాయి. పంట చేతికందిన తర్వాత ఆ ధరకు కొనుగోలు చేయకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. క్వింటా రూ. 11వేల నుంచి రూ. 12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. రైతులు క్వింటాపై రూ. 6 వేలకు పైగా నష్టపోయారు. నాణ్యత పేరుతో వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేయడంతో రైతులు అడుగడునా మోసపోయారు. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకుని పొగాకు సాగు చేసిన రైతులకు బోర్డు అధికారులు, వ్యాపారులు, దళారులు కలిపి రైతులకు టోపి పెట్టడంతో నష్టాల ఊబిలో కూరుకపోయారు.
పొగాకు రైతులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం అండగా నిలిచింది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేని సమయంలో అప్పట్లో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. పొగాకు కంపెనీలతో మాట్లాడి రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకుంది. క్వింటా రూ. 18 వేల వరకు మద్దతు ధర కల్పించడంతో రైతులు లాభాలు గడించారు.
రైతులకు తీవ్ర నష్టం వచ్చిన
పొగాకు సాగు
వెంటాడిన అధిక వర్షాలు,
ఎండు తెగులు
ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని
రైతుల డిమాండ్
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..


