41 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
శిరివెళ్ల: జిల్లాలో 41 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపా మని డీపీఓ లలితాబాయి తెలిపారు. మంగళవారం జాతీయ రహదారిపై ఉన్న శిరివెళ్ల మెట్ట వద్ద పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ప్రభుత్వం స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా మురికి కాల్వల శుభ్రత, పారిశుద్ధ్యంపై సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 489 గ్రామ పంచాయతీలుంటే ఇప్పటి వరకు 188 పంచాయతీల్లో స్వామిత్వ సర్వే మొదలై 88లో సర్వే పూర్తయిందన్నారు. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.10.69 కోట్ల ఇంటి పన్నులు వసూళ్ల లక్ష్యం కాగా ఇంత వరకు రూ. 3.86 కోట్లు వసూలైనట్లు తెలిపారు. కొత్తగా ఆన్‌లైన్ ద్వారా ఇంటి పన్ను లు, నీటి పన్నులు చెల్లించవచ్చన్నారు. ఆమె వెంట ఈఓ అశ్వనికుమార్ ఉన్నారు.
మల్లికార్జున సత్రంపై కేసు నమోదు
శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని మల్లికార్జున అన్నదాన సత్రంలో నిబంధనలకు విరుద్ధంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడంపై దేవస్థానం సీఎస్‌ఓ శ్రీనివాసరావు శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయపై సీఐ గంగనాథ్ బాబు మంగళవారం మాట్లాడుతూ.. సీఎస్‌ఓ ఫిర్యాదు మేరకు సత్రంలో జరిగిన సంఘటన మేరకు ఇందుకు బాధ్యులైన ఐదుగురు సిబ్బంది, సత్రం వారి పై భారతీయ న్యాయ సంహిత చట్టం సెక్షన్ 196, 199 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. భక్తుల ఆధ్యాత్మిక మనోభావాలను కించపరిచేలా అభ్యంతరకర పాటలతో డ్యాన్స్ వేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణకు చర్యలు
డోన్: స్క్రబ్ టైఫస్, డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పి ంచాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఉందని జిల్లా మలేరియా ముఖ్య అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం కన్నపకుంట, కమలాపురం గ్రామాల్లో సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, సబ్‌యూనిట్ అధికారి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దోమల నియంత్రణ, నివా రణకు సిబ్బంది తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్కాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశంమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత ను పాటించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో వైద్యాధికారులు వేణుగోపాల్‌రెడ్డి, ఆనంద్‌రావ్, పార్వతి, లత, చెన్నయ్య, చింతలయ్య పాల్గొన్నారు.
ఫేజ్ 3లో పులుల గణన
ఆత్మకూరు: ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఫేజ్–3లో కెమెరా ట్రాప్‌ల ద్వారా పులుల గణన ప్రారంభించినట్లు ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ తెలిపారు. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్‌లో ఈ గణన ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. పులుల గణన కార్యక్రమానికి జాతీయ ప్రాముఖ్యత ఉండటంతో ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు వెంకటాపురం నుంచి హఠకేశ్వరం వరకు, పెచ్చెరువు – నాగలూటి మార్గంలో ఫిబ్రవరి 8వ తేదీ వరకు భక్తుల పాదయాత్రకు అనుమతి ఇవ్వమన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు అనుమతి ఇస్తామన్నారు.


