వార్డెన్‌లు పని చేసే చోటే నివాసం ఉండాలి
● బీసీ వెల్ఫేర్ ఎక్స్–అఫీషియో కార్యదర్శి సత్యనారాయణ
కర్నూలు(సెంట్రల్): సంక్షేమ వసతి గృహాల వార్డెన్‌లు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండి విద్యార్థుల బాగోగులు చూసుకోవాలని బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల హెచ్‌డబ్ల్యూఓ, ఏబీసీడబ్ల్యూలు, డీబీసీడబ్ల్యూఈఓలు, ఎంజేపీఏపీబీసీ డబ్ల్యూర్ ఈఐఎస్ ప్రిన్సిపాళ్లతో బీసీ వెల్ఫేర్ ఎక్స్–అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు చక్కటి ఆరోగ్యం, విద్యను అందించాలన్నారు. మెనూపై శ్రద్ధపెట్టి మంచి పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత కోసం ప్రతి రోజూ స్టడీ అవర్స్‌ను నిర్వహించాలని, ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికను హాస్టళ్లలో సక్రమంగా అమలు చేయాలన్నారు. తరచూ పేరెంట్, టీచర్స్‌తో పిల్లల చదువు అంశాలపై సమీక్షించాలన్నారు. పనిచేసే ప్రదేశంలో ఉండకపోతే సిబ్బందిపై వేటు వేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ హాస్టల్ సెక్రటరీ మాధవీలత, జేడీ శ్రీధర్‌రెడ్డి, కర్నూలు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాల బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు ప్రసూన, కుస్బూ కొఠారి, జగ్గనయ్య, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలుతో ప్రత్యేకానుబంధం...
బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. దీంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి హోదాలో కర్నూలుకు రావడంతో ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనతో స్నేహంగా ఉన్న పలువురు అధికారులను గుర్తు చేసుకున్నారు.


