స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకులు సాధించాలి
నంద్యాల: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకులు సాధించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నిర్దేశించిన 10 కీలక పారామీటర్లపై మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి, సౌరశక్తి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాని సూచించారు. మెప్మా కార్యక్రమాల ద్వారా మహిళలకు జీవనోపాధి అవకాశాలు పెంచాలని, ఈ రంగంలో జిల్లా ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న నేపథ్యంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నంద్యాల, డోన్, నందికొట్కూరు, బేతంచెర్ల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపల్ కమీషనర్లు శేషన్న, ప్రసాద్ గౌడ్, వెంకట్రామిరెడ్డి, హరిప్రసాద్, కిశోర్, రమేష్ బాబులతో పాటు మెప్మా పీడీ వెంకటదాసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


