పాలనలో పారదర్శకతకు పెద్దపీట
● రూ.387.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ
● ఉమ్మడి జిల్లాలోని 695 జనవాసాలకు
సురక్షిత మంచి నీటి సరఫరాకు ప్రాధాన్యత
● జెడ్పీ సాధారణ నిధులు రూ.12.03 కోట్లతో 266 పనులు
● కారుణ్య నియామకాల కింద 154 మందికి ఉద్యోగాలు
● నాలుగేళ్ల పాలనపై జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు(అర్బన్): ప్రజలు ఉంచిన విశ్వాసం, నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. ఈ నెల 4వ తేదీకి జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం ఆయన జెడ్పీలోని తన ఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ ... పెద్దగా ఆదాయ వనరులు లేని జిల్లా పరిషత్‌కు ఆర్థిక జవసత్వాలు తీసుకువచ్చేందుకు అందరి సహకారంతో పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా జెడ్పీ స్థిరాస్తులకు సంబంధించిన, స్టాంప్ డ్యూటీ, సీనరేజి గ్రాంట్, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతరత్రా వనరులతో జెడ్పీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, జెడ్పీటీసీలు, జెడ్పీ అధికారులు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నారన్నారు.
రూ.382.72 కోట్లతో
59 సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.382.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా 695 జనవాసాలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ పథకాల నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధులు 2021–22 నుంచి 2024–25 వరకు రూ. 297.15 కోట్లు వెచ్చించామని, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.90.57 కోట్లు వెచ్చించేందుకు పరిపాలనా ఆమోదం జారీ చేశామన్నారు. అలాగే గడచిన నాలుగేళ్లలో 110 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 77 పనులు పూర్తి అయ్యాయని, ఇందుకు రూ.41,34,45,165 వెచ్చించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.41.52 కోట్ల అంచనాతో 990 పనులు చేపట్టామని, ఇందులో రూ.22.61 కోట్ల ఖర్చుతో 649 పనులు పూర్తి చేశామన్నారు. అలాగే నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో ఎస్సీ కార్పొరేన్‌కు రూ.2.81 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.1.11 కోట్లను విడుదల చేశామన్నారు. అలాగే ఎస్‌సీ, ఎస్‌టీ కాలనీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించేందుకు రూ.12.03 కోట్ల అంచనాతో 266 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు రూ.8.79 కోట్ల వ్యయంతో 204 పనులు పూర్తి కాగా, ఇంకా 62 పనులు వివిధ దశల్లో ఉన్నాయని చైర్మన్ వివరించారు.
వేసవిలో తాగునీటి నివారణకు
ప్రాధాన్యత
వేసవిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని నిధులను విడుదల చేసినట్లు చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రూ.6.13 కోట్ల అంచనాతో 188 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు రూ.4.48 కోట్ల వ్యయంతో 157 పనులు పూర్తి చేశామన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చామన్నారు.
సున్నిపెంటకు ప్రత్యేకంగా
రూ.72 లక్షలు
సున్నిపెంట గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగనందున 15వ ఆర్థిక సంఘం నిధులు అందని పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే సుండిపెంట గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణకు జెడ్పీ 4 శాతం నిధుల కింద రూ.72.10 లక్షలను విడుదల చేసినట్లు చైర్మన్ వెల్లడించారు.
నాలుగేళ్ల పాలనలో జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో కారుణ్య నియామకాల కింద 154 మందికి వివిధ కేడర్లలో ఉద్యోగాలు కల్పించామని జెడ్పీ చైర్మన్ తెలిపారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్లు 43, టైపిస్టులు 42, ఆఫీసు సబార్డినేట్లు 66, స్వీపర్లు 03 మంది ఉన్నారన్నారు. అలాగే వివిధ కేడర్లలో 378 మంది ఉద్యోగులు పదోన్నతులు పొందారన్నారు.


