పేకాట రాయుళ్లపై కేసు నమోదు
కౌతాళం: మండల కేంద్రం కౌతాళంలో నలుగురు పేకటరాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. స్థానిక బీరప్ప దేవాలయం పక్కన పబ్లిక్ స్థలంలో ఉసేన్‌సాబ్, దస్తగిరి, వెంకటేష్, అశోక్ పేకాట ఆడుతుండగా అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రూ.5725 నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడినా, అక్రమంగా సారా వ్యాపారం చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు.
బాలిక అదృశ్యం
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని చెట్నెహళ్లి గ్రామానికి చెందిన నాగవేణి(17) అనే బాలిక అదృశ్యమైనట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. గ్రామానికి చెందిన బి.శారదమ్మ, రామాంజినేయులు కుమార్తె బి.నాగవేణి సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంట్లో కనపడలేదు. కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతికినా, బందువులను ఆరా తీసినా జాడ తెలియక పోవడంతో తల్లి శారదమ్మ మంగళవారం మంత్రాలయం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నాగవేణి ఇంటి దగ్గరే టైలరింగ్ నేర్చుకునేది. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.
యువకులకు గాయాలు
పాములపాడు: మండలకేంద్రం పాములపాడులోని పాలడెయిరీ వద్ద కారు బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆత్మకూరు చెందిన మురహరి వినోద్‌కుమార్, కిరణ్‌లు ఆత్మకూరుకు బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో పాల డెయిరీ వద్ద యూ టర్న్‌లో బైక్ తిప్పుకుంటుండగా వేగంగా ఆత్మకూరు వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కర్ణాటకకు చెందిన కారు ఢీ కొట్టి వెళ్లి పోయింది. గాయపడిన ఇద్దరిని స్థాణికులు 108 వాహనంలో ఆత్మకూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తిరుపాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
అనూమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బోడబండ గ్రామ సమీపంలో వడ్దె బెల్లం వెంకట్రాముడు(55) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.బోడబండకు చెందిన వెంకట్రాముడు నాలుగు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు తిరిగి అతడే వస్తాడులే అనుకుని ఉన్నారు. అయితే, గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన పొలంలో నుంచి దుర్వాసన వస్తుండగా మంగళవారం అటుగా వెళ్తున్న వారు దగ్గరకు వెళ్లి చూడగా మృతదేహాం కనిపించింది. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించగా వారు పరిశీలించి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి చనిపోయింటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ మోటర్ కేబుల్
వైర్లు చోరీ
హొళగుంద: మండల పరిధిలోని హొన్నూరు క్యాంపునకు వెళ్లే దారిలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విలువైన విద్యుత్ మోటర్ కేబుల్ వైర్లు చోరీకి పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో ఎల్లెల్సీ కింద ఎక్కువగా వరిసాగు చేస్తారు. కాలువకు నీటి విడుదల లేకపోవడంతో రబీ సాగు లేక రైతులు పొలాల వైపు వెళ్లడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న దుండగులు పొలాల్లోని మోటర్ నుంచి స్టార్టర్ బాక్స్‌ల వరకు వెళ్లిన విలువైన కేబుల్ వైర్లను కత్తిరించుకుని వెళ్లారు. ఇలా రమేష్, సత్యప్ప, చిన్న మల్లేశ్, అడ్లిగి బసవరాజు, మల్లయ్య, గౌరవప్ప తదితర 20 మంది రైతులకు చెందిన మోటర్ల వైర్లను ఎత్తుకెళ్లారు. ఈ కేబుల్ వైర్ మీటర్ రూ.వందకు పైగ ధర ఉంటుందని ఒక్కో బోరు వద్ద 20 మీటర్లకు పైగ వైర్లను కత్తిరించారని రైతులు తెలిపారు. ఈ దొంగతనాలను అరికట్టాలని తుంగభద్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కృషయ్య కోరారు. చోరీ విషయాన్ని హొళగుంద పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు విలేకరులకు తెలిపారు.
పేకాట రాయుళ్లపై కేసు నమోదు
పేకాట రాయుళ్లపై కేసు నమోదు


