పలుకుబడికి పెద్దపీట
అర్హత ఉన్నవారికి అప్రాధాన్యత పోస్టులు
శ్రీశైల దేవస్థానంలో ఉన్న ఐదు ఏఈవో పోస్టులకు తోడు, దేవదాయశాఖ మంజూరు చేసిన రెండు ఏఈవో పోస్టులతో దేవస్థానంలో ఏడుగురు ఏఈవోలు ఉన్నారు. అయితే అర్హత కలిగిన వీరికి మాత్రం గోశాల నిర్వహణ, క్యూలైన్ల నిర్వహణ ఇలా చిన్నపాటి పర్యవేక్షుల స్థాయి విభాగాలను కేటాయిస్తున్నారు. అర్హత లేకపోయిన వారికి ఇతర కీలకమైన విభాగాన్ని కేటాయించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
శ్రీశైలంటెంపుల్: ఆధ్యాత్మికంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయ వేదికగా వాడుకుంటోంది. దేవస్థానం పాలన వ్యవహరాల్లో కూటమి నాయకుల పెత్తనం మితిమీరిపోతుందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్షేత్రంలో రాజకీయ జోక్యం మితిమీరినట్లు కనిపిస్తోంది. దీంతో ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు ఉద్యోగులు తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలనలో కొందరు అర్హత లేకపోయినా అందలం ఎక్కుతున్నారు. అర్హత ఉన్న వారికి మాత్రం అప్రాధాన్యత పోస్టులకు అంతర్గత బదిలీ చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు అంతర్గత బదిలీలు చేయాలన్న కమిషనర్ నిబంధనలను సైతం బేఖారత్ చేస్తూ..ఆధ్యాత్మిక కేంద్రాలకు రాజకీయ మకిలి అంటిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో రాజకీయాలు ఏంటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. దేవస్థానంలో ఏఈవో స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో ఉన్నారు. ఆలయం, అన్నదానం, వసతి విభాగం, రెవెన్యూ, పారిశుద్ధ్యం విభాగాలకు ఏఈవో స్థాయి అధికారులు ఉన్నారు. పరిపాలనా అవసరం కోసం మరో రెండు ఏఈవో పోస్టులను సైతం దేవదాయశాఖ మంజూరు చేసింది. అయితే అర్హత కలిగిన అధికారులు, నిబద్ధతతో పనిచేసే అధికారులు ఉన్నప్పటికీ వారికి వారి స్థాయి పోస్టు ఇవ్వ డం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అర్హత లేని ఉద్యోగులు అర్హతకు మించిన స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నా యి. కీలకమైన పోస్టును దక్కించుకునేందుకు ఓ అధి కారి స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో పాటు, తమకు పలుకుబడి ఉన్న మంత్రులు, దేవదాయశాఖ కమిషనర్ స్థాయిలో లాబీయింగ్ చేసి అంతర్గత బదిలీ చేయించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. కొసమెరుపు ఎంటంటే ఈయనకు మరో సహాయకుడు వచ్చినప్పటికీ, అఽతడిని సైతం ఫ్రోటోకాల్ విధులకు వినియోగించుకోవడం గమనార్హం. ప్రొటోకాల్ విధులకు చాలా మంది ఉన్నప్పటికీ, ప్రొఫెషనల్ పోస్టు నిర్వహిస్తున్న తన సహాయకుడిని ప్రొటోకాల్ విధులకు వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది.
కమిషనర్ ఆదేశాలు బేఖారత్..
ప్రతి దేవస్థానంలో ప్రతి ఉద్యోగికి పాలనాపరమైన అంశాలలో మెలుకువలు తెలుసుకునేలా, ప్రతి విభాగంపై పట్టు సాధించేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంతర్గత బదిలీ చేయాలని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఉత్తర్వులు శ్రీశైల దేవస్థానంలో మాత్రం కొందరికి వర్తించడం లేదు. రాజకీయ పలుకుబడితో దేవస్థాన ఉన్నతాధికారిపై ఒత్తిడి తీసుకువచ్చి అంతర్గత బదిలీ జరగకుండా లాబీయింగ్ చేయించుకుంటున్నారు. ఇతర విభాగాలకు చెందిన అధికారులను అంతర్గతంగా బదిలీ చేస్తున్న ఓ అధికారికి మాత్రం ఆ నియ మాలు వర్తించడం లేదు. దీంతో ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ట వేయడంతో ఆ విభాగంలో అవకతవకలు చోటుచేసుకునే అవకాశం ఉందనే విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా దర్శనం టికెట్ల కుంభకోణం, టోల్‌గేట్ కుంభకోణం, పెట్రోల్‌బంక్‌లో కుంభకోణాలు జరిగాయి.
శ్రీశైల దేవస్థానంలో మితిమీరిన
రాజకీయ జోక్యం
అర్హత లేకపోయినా..
అస్మదీయులకు అందలం
కీలకమైన పోస్టు ఓ అధికారికి
కట్టబెట్టిన కూటమి ప్రభుత్వం
అర్హులకు అప్రాధాన్యత పోస్టింగులు


