చట్ట పరిధిలో న్యాయం చేస్తాం
నంద్యాల: పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను చట్ట పరిధిలో విచారణ చేసి న్యాయం చేస్తామని అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యాలయంలో ప్రజల నుంచి అడిషనల్ ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వయంగా తెలు సుకున్న సమస్యలను పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులకు సూచించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, పొలం తగాదాలు, ఆస్తి తగాదాలు తదితర అంశాలపై 102 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించామన్నారు.
7న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 7న జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో ఉద యం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశంలో వ్యవసాయం–అనుబంధ శాఖలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మత్స్యశాఖ, దేవదా య ధర్మాదాయ శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరు కావాలని కోరారు.
రాయితీలు వెంటనే విడుదల చేయాలి
నంద్యాల(అర్బన్): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రావాల్సిన రాయితీలను తక్షణమే విడుదల చేయాలని జిల్లా పారిశ్రామిక వేత్తల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు నాగరాజు, రామకృష్ణలు కోరారు. వందశాతం రాయితీలు ఇవ్వాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కార్తీక్‌కు వారు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వందశాతం రాయితీలు ఇవ్వాల్సిన క్రమంలో పాలసీకి వ్యతిరేకంగా కేవలం 20, 40 శాతం మాత్రమే అది కూడా కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన పారిశ్రామిక వేత్తల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పారు. నవంబర్ 10వ తేదీలోపు రాయితీలు విడుదల చేయకపోతే విశాఖపట్నంలో ఈనెల 14, 15 తేదీల్లో జరగబోయే సమ్మిట్‌ను అడ్డుకుంటామన్నారు. కార్య క్రమంలో నాయకులు త్రిమూర్తులు, మౌలాలి, రాముడు, గోపాల్, అరుణ, మధు పాల్గొన్నారు.
చట్ట పరిధిలో న్యాయం చేస్తాం


