గడువులోగా అర్జీలు పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా స్వీకరించిన అర్జీలను గడువులోగా పరిష్కరించాని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఆర్‌ఓ రామునాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సమర్పించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదివి, నాణ్యతతో పరిష్కరించాలన్నారు. మోంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం అందేలా నివేదికలను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో 266 వినతులు వచ్చాయని, వాటిని నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు.
ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు
ప్రాంతాలను గుర్తించండి
నంద్యాల పట్టణంలో ఈవీ చార్జింగ్ స్టేషన్ల స్థాపనకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూ.2వేల కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టిందన్నారు. ఈ పథకం కింద 100 శాతం సబ్సిడీతో చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే అవకాశం ఉందని పేర్కొన్నారు. నంద్యాల పట్టణ పరిధిలో, జాతీయ రహదారుల వెంట, పబ్లిక్ ఉపయోగానికి అనువైన ప్రదేశాలలో 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయగల స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలన్నారు. నెడ్‌క్యాప్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్వహించబోతోందన్నారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని, కాలుష్యం తగ్గుతుందని, ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందన్నారు. నెడ్ క్యాప్ డెవలప్‌మెంట్ అధికారి డి. వీరేంద్ర బాబు ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను వివరించారు.


