కూటమి కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్: కూటమి ప్రభుత్వం కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్దామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తన స్వగృహంలో సోమవారం పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు దేశం సుధాకర్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ ఫోర్‌మెన్ కమిటీ పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించి పేదలకు వైద్య, విద్యను అందుబాటులో లేకుండా చేసేందుకు యత్నిస్తున్న కూట మి ప్రభుత్వాన్ని నిలదీసేలా ప్రజలను సమాయత్తం చేయాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వీటన్నింటి ని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతున్న విషయా న్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై ఉందన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వాసుపత్రులను కూడా ప్రైవేటుపరం చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
అక్రమ కేసులకు ఎవరూ భయపడరు
వైఎస్సార్‌సీపీని కనుమరుగు చేయాలని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. అక్రమ కేసులకు ఒక్క కార్యకర్త కూడా బెదిరిపోరనే విషయం ఇప్పటికే కూటమి నేతలకు అర్థమైందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కసితో పనిచేసి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అధిక సంఖ్యలో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, వైస్‌చైర్మన్ జాకీర్‌హుసేన్, పార్టీ వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు పోస్టు ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు కురుకుందు హరి, మండల, పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, పార్టీ నాయకులు చిరంజీవి, మిట్టా రవికుమార్, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, కొచ్చెర్వు మధురెడ్డి, బుగ్గన జయచంద్రారెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


