
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైల పుణ్యక్షేత్రానికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపైకలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. సున్నిపెంటలో హెలిపాడ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. హెలిపాడ్ నుంచి ప్రధానమంత్రి పర్యటించే ప్రదేశాల వరకు రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, లైటింగ్, పార్కింగ్ తదితర అంశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర వైద్య సేవలకోసం నిపుణులైన వైద్యుల బృందాలను నియమించాలన్నారు. అంబులెన్‌న్స్‌లు, అవసరమైన వైద్య పరికరాలు సిద్ధంగా ఉంచాలని జీజీహెచ్ సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్ అధికారులను ఆదేశించారు. భ్రమరాంబ గెస్ట్ హౌస్, దేవస్థాన పరిధిలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రాము నాయక్, ఆర్‌డీఓ విశ్వనాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.