
వైభవంగా పల్లకీ సేవ
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి పల్లకీ సేవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం జరిపించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అధిష్టింపజేశారు. పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయాన్ని నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగంలో ముగ్గురికి స్థానం
బొమ్మలసత్రం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగంలో నందికొట్కూరుకు చెందిన ముగ్గురికి స్థానం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్టేట్ స్టూడెంట్ వింగ్ కమిటీ జనరల్ సెక్రటరీగా నందికొట్కూరుకు చెందిన కె.మాధురిగౌడ్, సెక్రటరీగా కుందన రాజశేఖర్‌గౌడ్, స్టేట్ మైనార్టీ సెల్ కమిటీ సెక్రటరీగా షేక్ మహమ్మద్ అబ్దుల్‌జఫార్‌లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతిభను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు యువజన ఉత్సవాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపా. జిల్లా యువజన సంక్షేమ శాఖ–సెట్కూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు సంబంధించి పోస్టర్‌ను శుక్రవారం తన చాంబర్‌లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోటీల్లో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు పొల్గొనవచ్చన్నారు. ఈ నెల 29న నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు ఏడు విభాగాల్లో నిర్వహిస్తామని చెప్పారు. సెట్కూరు సీఈఓ డాక్టర్ కె. వేణుగోపాల్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారు జాతీయ స్థాయికి ఎంపికవుతారని తెలిపారు. పూర్తి వివరాలకు మొబైల్ నంబర్లు 9292207601, 8328181581లను సంప్రదించవచ్చన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బయ్య, సెట్కూరు పర్యవేక్షణ అధికారి శ్యామ్ బాబు పాల్గొన్నారు.
‘నంద్యాల శనగ’తో అధిక దిగుబడులు
నంద్యాల(అర్బన్): నంద్యాల గ్రామ్ 776 శనగ రకం సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్సన్ తెలిపారు. అఖిల భారత రబీ అపరాల(శనగ) సమన్వయ పరిశోధనా పథకం కింద షెడ్యూల్ కులాల ఉపప్రణాళిక– ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల నిర్వహణలో భాగంగా శుక్రవారం ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామ ఎస్సీ రైతులకు నంద్యాల గ్రామ్ 776 శనగ రకంతో విత్తనశుద్ధి మందులను పంపిణీ చేశారు. స్థానిక కార్యాలయలలో జరిగిన కార్యక్రమంలో ఏడీఆర్ జాన్సన్ మాట్లాడుతూ.. ఎండుతెగులును తట్టుకొనే నంద్యాల గ్రామ్ 776 శనగ రకం జీవన శిలీంధ్ర నాశినిలతో విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. సరైన సమయంలో ఇచ్చిన పురుగు మందులు, శిలీంధ్ర నాశినిలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ చెన్నయ్య, శనగ శాస్త్రవేత్తలు నీలిమ, మంజునాథ్, చైతన్య పాల్గొన్నారు.

వైభవంగా పల్లకీ సేవ

వైభవంగా పల్లకీ సేవ