
టీడీపీ ముఖ్య నేతలే నకిలీ మద్యం వ్యాపారులు
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
డోన్: రాష్ట్రంలో చలామణి అవుతున్న నకిలీ మద్యం మూలాలు టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్య నాయకులవేనని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం డోన్‌లోని తన స్వగృహంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం, మొలకల చెరువులలో కల్తీ లిక్కర్ డెన్‌లు గుర్తించినప్పుడే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా కేసులు పక్కదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోందన్నారు. ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులపై దాడులు నిర్వహించి నకిలీ మద్యం తయారీ మూలాలను కనుగొనడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గురువింద గింజ తన కింది నలుపు ఎరగదన్నట్లు కల్తీ మద్యం కేసులో నిందితులందరూ టీడీపీకి చెందిన వారే కాగా, దురుద్దేశ్య పూర్వకంగా ఆ నిందను వైఎస్సార్‌సీపీ నాయకులకు అంటగట్టాలని చూస్తున్నారన్నారు. గతంలో పాలకొల్లు, ఏలూరు, పరవాడ ప్రాంతాల్లో దొరికిన కల్తీ మద్యం ఎవరిదనే విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా అధికార పార్టీ నేతలు కప్పిపుచ్చిన సంగతిని ప్రజలు మరిచిపోలేదన్నారు.
పాల్గొన్న పార్టీ నాయకులు
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు దేశం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డిల అధ్యక్షతన కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీలు బుగ్గన నాగభూషణంరెడ్డి, రేగటి రాజశేఖర్ రెడ్డి, దిలీప్ చక్రవర్తి, మున్సిపల్ చైర్మన్‌లు సప్తశైల రాజేష్, చలంరెడ్డి, పార్టీ వాలెంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు పోసు్ట్రపసాద్, ఉపాధ్యక్షులు కురుకుందు హరి, బొబ్బల శివరామిరెడ్డి, బుగ్గన జయచంద్రారెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి, దినేష్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ జాకీర్‌హుసేన్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శులు పాలుట్ల రఘురాం, రఘు, జెడ్పిటిసిలు బద్దల రాజ్‌కుమార్, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌లు మల్యాల రామచంద్రుడు, బోరెడ్డి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి
కూటమి ప్రభుత్వంలో అన్ని చోట్ల టీడీపీ నేతలు అవినీతి చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించి టీడీపీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. పేద విద్యార్థులకు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. రైతాంగంతో పాటు అట్టడుగు నిరుపేద వర్గాలు, అల్ప సంఖ్యాకుల వర్గాలకు ఒరిగిందేమీ లేదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జననేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలుచేయడం తప్ప కూటమి ప్రభుత్వం పేదల కోసం ఫలానా పని చేశామని గొప్పలు చెప్పుకునేందుకు ఏమీ లేదన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ఇదే జరిగితే నిరుపేదలకు వైద్యం ఉచితంగా అందే అవకాశం ఉండబోదన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అసవరం ఉందన్నారు.