ప్రతి రోగికి అభా ఐడీ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ప్రతి రోగికి అభా ఐడీ తప్పనిసరి

Sep 12 2025 5:57 AM | Updated on Sep 12 2025 5:57 AM

ప్రతి

ప్రతి రోగికి అభా ఐడీ తప్పనిసరి

గోస్పాడు: చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే రోగికి అభా ఐడీ తప్పని సరిగా నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. నంద్యాల మెడికల్‌ కళాశాలలో గురువారం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సురేఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనర్‌ కోటిరెడ్డి, ప్రాజెక్టు కోఆర్డినేటర్లు మెడికల్‌ ఆఫీస ర్లు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆయూష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌, ఆరోగ్య మిత్ర కార్యక్రమాలపై వివరించారు. ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వచ్చే ప్రతి రోగికి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డులు తప్పనిసరి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్‌ అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు

కర్నూలు (టౌన్‌): వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు లభించింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమిస్తూ గురువారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులుగా నేషా శ్రీనివాసులు, మహిళా విభాగం.. దూదేకుల హుస్సేనమ్మ, రైతు విభాగం.. బెక్కమ్‌ వెంకట రామసుబ్బా రెడ్డి, ఎస్సీ సెల్‌.. వై. నాగేశ్వరరావు, ఎస్టీ సెల్‌.. సురా రామచంద్రుడు, క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌.. డాక్టర్‌ ఎంఎస్‌సీ. మనోజ్‌, గ్రీవెన్స్‌ సెల్‌.. ముక్కమల్ల్ల వివేకానందరెడ్డి, వీవర్స్‌ విభాగం.. అవ్వారి ఎల్లా సుబ్బరాయుడు, వైఎస్సార్‌టీయూసీ.. షేక్‌ అల్లాబకాష్‌, లీగల్‌ సెల్‌.. ఎంఎస్‌ఎన్‌వీ. ప్రతాప్‌ రెడ్డి, బూత్‌ కమిటీ విభాగం.. హరినాథ్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ విభాగం.. ఏసం రామసుబ్బారెడ్డి, ఆర్‌టీఐ విభాగం.. ఎంఆర్‌ కృష్ణారెడ్డి, వాణిజ్య విభాగం.. ఎస్‌. మనోహర్‌ రెడ్డి, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా ఎర్వా దివాకర్‌ రెడ్డిని పార్టీ నియమించింది.

రేపు జాతీయ లోక్‌ అదాలత్‌

కర్నూలు(టౌన్‌): జాతీయ లోక్‌ అదాలత్‌ను ఈనెల 13న కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌, ప్రీ లిటిగేషన్‌ కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో 5 బెంచీలు, ఇతర మండలాల్లో 15 బెంచీలు ఏర్పాటవుతాయన్నారు. కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను వినియోగించుకుని తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

కేఎంసీలో పెరిగిన మెడిసిన్‌ పీజీ సీట్లు

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కాలేజిలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి అదనంగా తొమ్మిది పీజీ సీట్లు పెరిగాయి. ప్రస్తుతం 20 పీజీ సీట్లు ఉండగా, అదనంగా 9 సీట్లకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతిచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ తెలిపారు. పెరిగిన సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తాయని, ఈ సీట్ల కోసం ప్రత్యేకంగా జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీరాములును ఢిల్లీకి పంపి ప్రక్రియ పూర్తి చేయించామన్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ, క్యాన్సర్‌ మొదలైన విభాగాల్లో అదనపు పీజీ సీట్ల కోసం ప్రతిపాదనలు పంపించామని, వచ్చే విద్యాసంవత్సరం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

శ్రీగిరిలో 5వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వర్షకాలం ముగిసేలోగా 5 వేల మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు రూపొందించామని శ్రీశైల ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరుకు చెందిన ఎన్‌డీఆర్‌ గ్రూపు చైర్మన్‌ ఎన్‌.ఆదికేశవులురెడ్డి శ్రీశైల దేవస్థానానికి 2 వేల బిల్వం మొక్కలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు గురువారం శ్రీగిరిలోని భ్రామరీ పుష్పవనంలో బిల్వం మొక్కలను దేవస్థాన ఈఓ నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రం మొత్తంలో 30 శాతం దేవతా మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. బిల్వం, కదంబం, రుద్రాక్ష, తెల్లమద్ది, ఉసిరి, రావి, మేడి, వేప మొదలైన వృక్షాలను నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.

ప్రతి రోగికి అభా ఐడీ తప్పనిసరి 1
1/1

ప్రతి రోగికి అభా ఐడీ తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement