
ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు దిట్ట
కల్లూరు: ప్రజలను మభ్యపెట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. గురువారం కాటసాని స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలన్నీ అమలు చేయకుండానే అధికారంలోకి వచ్చాక 15 నెలల్లోనే హామీలన్నీ మొత్తం అమలు చేశామని అనంతపురం జిల్లాలో సభలో చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. అధికారంలోకి వచ్చాక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని సభలో ఊదరగొట్టారన్నారు. అయితే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి పథకాల ఊసే లేదన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అందరికీ అందలేదన్నారు. ఉచిత బస్సు పథకం కేవలం కొన్ని బస్సులకే పరిమితం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో పేదలందరికీ నాణ్యమైన చదువులు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి పనులు మొదలు పెట్టామన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఆనాడు మేధావులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అయితే ఆ మెడికల్ కళాశాలలపై చంద్రబాబు కుట్ర పన్నుతున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతో పనులన్నీ ఆపి ఏకంగా పది మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
రైతుల పరిస్థితిపై చర్చకు సిద్ధమా..
గత వైఎస్సార్‌సీపీ పాలన, ప్రస్తుత 15 నెలల కూటమి ప్రభుత్వ పానలలో రైతుల పరిస్థితులపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కాటసాని సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులు ఏనాడు రోడ్లపైకి రాలేదన్నారు. కేవలం 15 నెలల పాలన కాలంలో రైతుల పరిస్థితి ఎలాగుందో రాష్ట్రంలోని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ఆర్‌డీవోలకు వినతి పత్రమిచ్చామన్నారు. రైతుల కోసం పోరాటం చేయడం తప్పా? అన్ని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ర్యాలీలో పాల్గొనకుండా నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో రైతుల అభ్యున్నతి కోసం ధరల స్థిరీకరణ తీసుకువచ్చి వారికి అండగా నిలిచామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు చిట్టెమ్మ, లక్ష్మీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, నాయకులు అక్కిమి హనుమంతురెడ్డి, కేవీ రమణారెడ్డి, సుంకన్న, శివారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
జగనన్న హయాంలో
రైతులు ఏనాడూ రోడ్డెక్కలేదు
మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణ దారుణం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి