
బాబ్బాబు.. రండి!
మధ్యాహ్నం 12 గంటల సమయంలో
ఖాళీగా ఉన్న కుర్చీలు
కారులో నుంచి దిగుతున్న నర్సాపురం
ఎంపీటీసీ సభ్యుడు కిరణ్
రుద్రవరం: మండల సర్వ సభ్య సమావేశం అంటే మినీ శాసనసభ లాంటిది. ఎంపీటీసీ సభ్యులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు మంచి అవకాశం. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల తీరును ఎండగట్టేందుకు సరైన వేదిక. అలాంటి మండల మీట్ మొక్కుబడి సమావేశంగా మారిపోతుంది. ఏదో వచ్చామా.. సంతకాలు చేశామా.. వెళ్లామా అన్నట్లుగా సభ్యు లు, అధికారులు వ్యవహరిస్తున్నారు. గురువారం రుద్రవరం మండల మీట్‌కు సభ్యులు ఎవరూ రాకపోవడంతో అధికారులే వారి ఇళ్ల వద్దకు వెళ్లి వాహనాల్లో పిలుచుకొచ్చి మమ అనిపించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ మబ్బు బాలస్వామి అధ్యక్షతన ఇన్‌చార్జి ఎంపీడీఓ సుబ్రమణ్యం గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉదయం 10.30 ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం రూ.12.30 గంటలకు మొదలైంది. అయితే తమకు 20 నెలలు గా వేతనాలు అందడం లేదని, తాము చెప్పిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, పెట్రోల్ ఖర్చులు దండగా అని ఎంపీటీసీ సభ్యులు ఎవరూ రాలేదు. సమావేశం నిర్వహించేందుకు సరిపడ సభ్యుల కోరం లేక పోవడంతో అధికారుల్లో దడ మొదలైంది. అప్పటి నుంచి ఎంపీటీసీలందరికీ ఫోన్లు చేస్తూ సమయం లేదు త్వరగా రండి అంటూ బతిమిలాడారు. 14 మంది ఎంపీటీసీల్లో కనీసం ఐదుగురినైనా రప్పించాలని ప్రయత్నాలు చేశారు. ఎవరూ స్పందించక పోవడంతో మండల పరిషత్ అధికారులు ఏకంగా కారు తీసుకోని ఇతర గ్రామాల్లోని ఎంపీటీసీ సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని బతిమిలాడి తీసుకురావడంతో 12.30 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు. 20 శాఖలకు సంబంధించిన అధికారులు కేవలం అరగంట లోపే తమ నివేదికలు చదివి వినిపించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో భూ రీసర్వే డిప్యూటీ తహసీల్దారు మహమ్మద్ రఫి, ఎంఈఓ లక్ష్మీదేవి, ఏఈలు కమాల్, సుబ్రమణ్యం, పశు వైద్యాధికారి మనోరంజన్ ప్రతాప్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు ఉన్నారు.
మండల మీట్‌కు హాజరు కాని
ఎంపీటీసీ సభ్యులు
ఇళ్లకు వెళ్లి కారులో తీసుకొచ్చిన
అధికారులు
అర గంటలో మమ అనిపించిన వైనం

బాబ్బాబు.. రండి!