ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు

Sep 12 2025 5:57 AM | Updated on Sep 12 2025 6:37 AM

నంద్యాల(అర్బన్‌): బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం ప్రభావంతో జిల్లా తడిచిముద్దయ్యింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. కొలిమిగుండ్ల మండలంలో అత్యధికంగా 128.4 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వంకలు, వాగులు పొంగి పొర్లాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి. అవుకు మండలంలో 67.2, ప్యాపిలి 66.2, ఆళ్లగడ్డలో 60.4, నంద్యాల అర్బన్‌ 59.8, బండిఆత్మకూరు 56.2, నంద్యాల రూరల్‌ 55.2, చాగలమర్రి 52.2, కోవెలకుంట్ల 50.0, గోస్పా డు 43.6, ఉయ్యాలవాడ 32.4, బనగానపల్లె, సంజామల 30.0, పాణ్యం 25.2, శ్రీశైలం 20.2, దొర్నిపాడు 19.2, రుద్రవరం 17.6, బేతంచెర్ల 17.2, మహానంది 15.2, గడివేముల 13.2, శిరివెళ్ల 9.8, వెలుగోడు 9.4, పాములపాడు 5.2 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. వర్షం వరి రైతులకు మేలు చేకూర్చేదిగా ఉండగా మొక్కజొన్న, మినుము రైతులకు నష్టాన్ని మిగిల్చింది.

● ఉయ్యాలవాడ మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మిరప, పత్తి, మినుము, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. కోవెలకుంట్ల, జమ్మలమడుగు ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిలో అల్లూరు, గుళ్లదుర్తి గ్రామాల మధ్య భారీ వృక్షాలు నేలకూలాయి. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి.

● కోవెలకుంట్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాలుజలయమయ్యాయి.

● అవుకు సమీపంలోని కొండమీది గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

● కొత్తపల్లి మండలంలో భారీ వర్షానికి విద్యుత్‌స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి.

● ఆత్మకూరు పట్టణంలో భవనాశి, సుద్దవాగు ఉప్పొంగి ప్రవహించాయి.

● ఆళ్లగడ్డలో భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రైతులకు టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసి వాన నీటిలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. సంజామల మండలం పేరుసోముల, రామిరెడ్డిపల్లె గ్రామాల్లో కంది, ఉల్లి, మినుము పంటలు నీట మునిగి రైతులు భారీగా నష్టపోయారు.

● కొలిమిగుండ్ల మీదుగా వెళ్లే నెల్లూరు–ముంబై హైవేపై భారీ వర్షం కారణంగా తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కల్వటాల గ్రామం వద్ద ఎరవ్రాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అటు తిమ్మనాయినిపేట, ఇటు కొలిమిగుండ్ల వరకు వాహనాలు 6 కి.మీమేర నిలిచిపోయాయి. జమ్మలమడుగు, తాడిపత్రికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వర్షానికి కూలిన మట్టి మిద్దె

ప్యాపిలి: మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. మండలంలో 66.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా పలు పాత మిద్దెలు కారడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండల పరిధిలోని కలచట్ల గ్రామంలో అంబా చంద్రశేఖర్‌కు చెందిన మట్టి మిద్దె కూలింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు1
1/2

ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు

ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు2
2/2

ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement