
కస్తూర్బా విద్యార్థులకు విష జ్వరాలు
కొలిమిగుండ్ల: స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థినులు విష జ్వరాల బారిన పడటంతో ఇంటి బాట పడుతున్నారు. నాలుగు రోజుల నుంచి జ్వరాలు రావడంతో పాఠశాల సిబ్బంది మందులు ఇస్తుండేవారు. జ్వరాలు తగ్గుముఖం పట్టకపోవడంతో దాదాపు 20 మంది విద్యార్థినులను ఇళ్లకు పంపారు. సమాచారం అందుకున్న తల్లితండ్రులు పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. జ్వరంతో పాటు జలుబు, చేతులకు దద్దులు వస్తున్నట్లు విద్యార్థుల తల్లితండ్రులు తెలిపారు. ప్రస్తుతం విష జ్వరాలు ప్రమాదకరంగా మారడంతో ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించుకున్నారు. పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు.