
టమాట ధర నేలచూపు!
● 25 కేజీల బాక్స్ ధర రూ.150
పత్తికొండ: ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా పత్తికొండ వ్యవసాయశాఖ సబ్ డివిజన్‌లో టమాట సాగవుతోంది. ఈ ఏడాది 6,400 హెక్టార్లులో సాగు చేశారు. రాష్ట్రంలో మదనపల్లి మార్కెట్ టమాట విక్రయాల్లో మొదటి స్థానం కాగా.. పత్తికొండ మార్కెట్ రెండో స్థానంలో ఉంటుంది. ఇలాంటి చోట టమాట రైతు గిట్టుబాటు ధర కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది. దాదాపు 2,500 హెక్టార్లులో టమోట పంటలో ఇప్పుడే కోతలు మొదలయ్యాయి. అక్టోబర్ నుంచి జనవరి వరకు నిత్యం దాదాపు 20 లారీలకు పైగా టమోటలను రైతులు మార్కెట్‌కు తీసుకొస్తారు. అరంభంలో ప్రతి ఏడాది 2 నుంచి 3నెలల వరకు మంచి ధర పలుకుతుంది. అయితే ఈఏడాది కేవలం 15 రోజులు మాత్రమే ఓ మోస్తరు ధర పలికింది. పంట మంచి దిగుబడితో ఇప్పుడిప్పుడే కోతలకు వస్తుంది. ఇలాంటి తరుణంలో టమోట ధర నెలచూపులు చూస్తుండటంతో అన్నదాత కష్టం బూడిదిలో పోసిన పన్నీరవుతోంది. ఇక్కడ పండించిన టమాటకు తమిళనాడు, పాండిచ్చేరి, హైదారాబాద్, వరంగల్ మార్కెట్‌లలో మంచి డిమాండ్ ఉంటుంది. ధరలు అశాజనకంగా లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
జ్యూస్ ఫ్యాక్టరీ ఇంకెప్పుడు?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పత్తికొండ–గుంతకల్ రహదారిలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలం కేటాయించడంతో పాటు నిధులు కూడా మంజూరు చేశారు. పనులు ప్రారంభించిన కొన్ని నెలలకే అధికార మార్పిడి జరగడంతో కూటమి ప్రభుత్వం పనులను ఎక్కడికక్కడ నిలిపేసింది. రైతుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కొద్ది రోజుల తర్వాత పత్తికొండ మండలం కనకదిన్నె వద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ ఖరీఫ్‌కే పనులు పూర్తి చేసి ప్రాసెసింగ్ యూనిట్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అయితే పనులు పునాదుల దశలోనే ఉండిపోగా.. రైతుల కష్టాలు తీవ్రమయ్యాయి.