
వచ్చే నెల 22 నుంచి దసరా ఉత్సవాలు
మహానంది: వచ్చే నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు మహానందిలో దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో శుక్రవారం పండితులు, ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. గత ఏడాది కంటే దసరా నవరాత్రి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించాలన్నారు. దాతల సహకారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రతి రోజూ అలంకరణలతో పాటు విశేష పూజలు ఉంటాయన్నారు. ఏఈఓ మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, పి.సుబ్బారెడ్డి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కంట్రోల్ రూమ్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌లో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 41,247 అర్జీలు రాగా 38,862 పరిష్కారాలు జరిగాయన్నారు. ప్రజా వినతులకు సరైన స మాధానాలు ఇవ్వని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉన్న 230 మంది అధికారులకు మె మోలు జారీ చేసి 13,403 వినతులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పీజీఆర్‌ఎస్ సమస్యల పరిష్కారంలో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు.
గిడుగు రామ్మూర్తి సేవలు ఎనలేనివి
కర్నూలు(అర్బన్): తెలుగు వైభవం కోసం పోరాటం నిర్వహించిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని, ఆయన సేవలు ఎనలేనివని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా స్థానిక మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈఓ మాట్లాడుతూ.. గిడుగు రామ్మూర్తి 1863 ఆగస్టు 29వ తేదిన జన్మించారన్నారు. తెలుగు వాడుక భాష పితామహుడుగా, గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకలోకి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీలోని వివిధ విభాగాలకు చెందిన పరిపాలనాధికారులు సీ మురళీమోహన్‌రెడ్డి, బసవశేఖర్, రాంగోపాల్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఎంబీబీఎస్ మొదటి విడత అడ్మిషన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాలలో మొదటి విడత స్టేట్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్లు శుక్రవారం ముగిశాయి. ఇందులో భాగంగా మంగళవారం 16 మంది, బుధవారం 10 మంది, గురువారం అధికంగా 110 మంది, చివరి రోజైన శుక్రవారం 15 మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పటికే నేషనల్ కోటాలో 37 సీట్లకు గాను 28 మంది అడ్మిషన్ తీసుకున్నారు. రాష్ట్ర కోటా, నేషనల్ కోటాలో మిగిలిన సీట్లకు తర్వాతి విడత కౌన్సెలింగ్‌లలో భర్తీ చేయనున్నారు.
సహకార శాఖలో
27 మందికి పదోన్నతులు
కర్నూలు(అగ్రికల్చర్): సహకార శాఖలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 27 మందికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురికి అసిస్టెంట్ రిజిస్ట్రార్ నుంచి డిప్యూటీ రిజిస్ట్రార్ గా పదోన్నతి లభించింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అయిన శివరామకృష్ణను ఆత్మకూరు నుంచి నంద్యాల సహకార ఆడిట్ అధికారిగా, రుక్సానా బేగంను కర్నూలు డీసీఓ ఆఫీస్ నుంచి నంద్యాల డీఎల్‌సీఓగా నియమించారు.

వచ్చే నెల 22 నుంచి దసరా ఉత్సవాలు