గుండె గుడిలో వైఎస్సార్‌ | - | Sakshi
Sakshi News home page

గుండె గుడిలో వైఎస్సార్‌

Sep 2 2025 3:17 PM | Updated on Sep 2 2025 3:17 PM

గుండె

గుండె గుడిలో వైఎస్సార్‌

ఆ రోజు ఏం జరిగిందంటే.. ప్రజల ఆరాధ్య నేత సంక్షేమానికి మారు పేరు వైఎస్సార్‌

ప్రజల అవసరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా పాలన అందించిన మహానేత వైఎస్సార్‌. ప్రభుత్వాలు మారినప్పటికీ దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు నేటికీ అమలులో ఉన్నాయి. ప్రజలు తమ గుండెలో వైఎస్సార్‌కు గుడికట్టుకున్నారు. నల్లకాల్వలో ఏర్పాటు చేసిన స్మృతి వనానికి పోటెత్తుతున్నారు. ‘రాజన్నా.. నిన్ను మేం మరువలేం’ అంటున్నారు. నేడు(మంగళవారం) మహానేత వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. – కర్నూలు(అగ్రికల్చర్‌)/ఆలూరు/

కోవెలకుంట్ల/ఆత్మకూరు/నందికొట్కూరు/కృష్ణగిరి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనా కాలన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు. ముఖ్యమంత్రిగా 2004లో ప్రమాణ స్వీకరం చేసిన వెంటనే ఉచిత విద్యుత్‌ ఫైల్‌ మీద మొదటి సంతకం చేసి రైతులకు భరోసా ఇచ్చారు. ఆ కాలంలోనే ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారు. ఆరోగ్య శ్రీ పేరుతో సామాన్యులకు కార్పొరేట్‌ వైద్యశాలల్లో వైద్యం అందుబాటులోకి తెచ్చారు. జలయజ్ఞం చేపట్టి రైతులకు సాగునీటి సదుపాయం కల్పించారు. పోతిరెడ్డిపాడు రిజర్వాయర్‌ ప్రాణం పోశారు. వైఎస్సార్‌ హయాంలోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో కార్యరూపం దాల్చింది. ఈ పథకాన్ని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలసి ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లిలో శ్రీకారం చుట్టారు. ‘ఉపాధి’ నిధులతో డ్రైల్యాండ్‌ హార్టికల్చర్‌ కింద పండ్లతోటల సాగును ప్రోత్సహించారు. అప్పట్లోనే 8000 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేశారు. జిల్లాలో భూమిలేని నిరుపేదలకు ఆరు విడుతలగా 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పంపిణీ చేశారు. సూక్ష్మసేద్యం అమలుకు ప్రత్యేకంగా ఏపీఎంఐపీని ఏర్పాటు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో ఉమ్మడి జిల్లాలో 2000 మంది ఉన్నత స్థానాలు పొందారు. వైఎస్సార్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయి.

ప్రజల జీవితాల్లో వెలుగులు

ఉమ్మడి కర్నూలు జిల్లా కరువు, కాటకాలకు నెలవుగా ఉండేది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 2023 ఏప్రిల్‌ 9న పాదయాత్రకు వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. మొత్తం 1460 కిలో మీటర్లు నడచి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లారా చూశారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రానికి 2004లో ముఖ్యమంత్రిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టడంతోనే రైతులు, ఇతర అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు పరుచుకున్నాయి. ఐదున్నర ఏళ్లలో ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్‌ 29 సార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

‘జల’సిరులు

● జలయజ్ఞంలో భాగంగా రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్‌ను రూ. 70కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్‌లో వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు. 2010 నాటికి పనులన్నీ పూర్తి కావడంతో 4టీఎంసీల నీళ్లు నింపుతూ వచ్చారు. రైతులు కాల్వల ద్వారా రెండు కార్లు పంటలు పండించుకుంటున్నారు. రిజర్వాయర్‌ ఏర్పాటుతో నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో 42,509 లక్షల ఎకరాలకు సాగు నీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందుతోంది.

● నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీ–నీవా కాలువ ఏర్పాటు చేసి కృష్ణాజలాలతో సస్యశామలం చేశారు. కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి 80వేల ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్‌ మండలంలోని 50 గ్రామాలకు, డోన్‌పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ. 55కోట్లతో తాగునీరు అందించారు.

● నందికొట్కూరు నియోజకవర్గంలో మల్యాల, ముచ్చుమర్రి, నాగటూరు ఫేస్‌–1, ఫేస్‌–2, తాటిపాడు, ఇస్కాల, చెల్లిమిల, లింగాల, శివపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలను వైఎస్సార్‌ మంజూరు చేశారు. దీంతో మొట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి.

● పోత్తిరెడ్డిపాడు నుంచి 12 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే గతంలో తరలించేవారు. వైఎస్సార్‌ పాలనలో పోతిరెడ్డిపాడును వెడల్పు చేసి 40 వేల క్యూసెక్కల నీటిని తరలించి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించారు.

సరిగ్గా 16 ఏళ్ల క్రితం.. 2009 సెప్టెంబర్‌ 2వ తేదీన చిత్తూరు జిల్లా అనుపల్లి గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అప్పటి సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బెల్‌ 420 హెలికాప్టర్‌లో బయలు దేరారు. కొంత సమయం తర్వాత హెలికాప్టర్‌ కనిపించకపోవడంతో ఆందోళన మొదలైంది. అప్పటి ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా అనుపల్లికి చేరకపోవడంతో రాష్ట్ర ప్రజలందరిలో నరాలు తెగే ఉత్కంఠ ప్రారంభమైంది. హెలికాప్టర్‌ ప్రమాదంలో నల్లమలలోని నల్లకాల్వ సమీపంలో ఉన్న పావురాలగుట్టలో వైఎస్సార్‌ మృతి చెందినట్లు సెప్టెంబర్‌ 3న వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రజలు తమ ఆరాధ్య నేతను గుండెల్లో దాచుకున్నారు. మహానేతను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలో చూసుకుంటున్నారు.

కర్నూలు టౌన్‌: దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రజల ఆరాధ్య నేత అని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం కర్నూలులోని ఎస్‌బీఐ సర్కిల్‌ వద్ద మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పిస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్వీ విజయ మనోహరి, పార్టీ నాయకులు పాల్గొంటారన్నారు.

తన పాలనా కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జన హృదయ నేతగా నిలిచారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. మహానేత వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం పాణ్యం అర్బన్‌ పరిధిలోని కల్లూరు షరీన్‌ నగర్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మహానేతను మరచిపోలేని రాష్ట్ర ప్రజలు

ఆరోగ్యశ్రీ పథకంతో

పేదల గుండెలకు భరోసా

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

జలయజ్ఞంతో సాగులోకి వచ్చిన

బీడు భూములు

నేడు మహానేత వర్ధంతి

గుండె గుడిలో వైఎస్సార్‌ 1
1/1

గుండె గుడిలో వైఎస్సార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement