
ఇకపై అర్జీదారుల వాయిస్ రికార్డు
● వినతులు గడువులోగా పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
డోన్: రానున్న రోజుల్లో వివిధ సమస్యలపై వినతులు ఇచ్చే అర్జీదారుల వాయిస్ కూడా వారి సమ్మతితో రికార్డు చేసి భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వెల్లడించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆర్‌డీఓ నరసింహులు అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడు తూ.. పరిష్కార వేదికకు తమ సమస్యలు చెప్పుకు నేందుకు వచ్చిన ప్రజల పట్ల సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ వినతులు పరి ష్కరించాలన్నారు. ఆళ్లగడ్డ, బండిఆత్మకూరు, కొత్తపల్లి, పగిడ్యాల, ఉయ్యాలవాడ మండలాల్లో అర్జీదారుల నుంచి సమస్యలు పదేపదే పునరావృతమవుతున్నందువల్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం కౌసలం అనే యాప్ ద్వారా పదవ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థుల వివరాలను నమోదు చేస్తామన్నారు. ఈ యాప్ ద్వారా రానున్న రోజుల్లో 5 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
వినతుల్లో కొన్ని..
● ప్యాపిలి మండలం పీఆర్‌పల్లె గ్రామానికి చెందిన వడ్డె వెంకట్రాముడు తనకు పీఎం కిసాన్ వర్తించలేదని ఫిర్యాదు చేయగా, డోన్ పట్టణానికి చెందిన పెద్దసుబ్బయ్య అన్ని అర్హతలు ఉన్నా తనకు రేషన్‌కార్డు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు.
● స్థానిక పేరంటాలమ్మ గుడి వద్ద నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల్లో ప్రభుత్వం పక్కాగృహాలు మంజూరు చేయాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
● పట్టణంలోని 503 సర్వే నంబర్‌లో నిరుపేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
● మోడల్‌స్కూల్ వెనుకభాగంలో ఉన్న సర్వే నంబర్ 284లో 4.10 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి వుంటే ఇటీవల ఆన్‌లైన్‌లో ప్రైవేటు వ్యక్తు ల పేర్లు నమోదు చేశారని, విచారించి చర్యలు తీసుకోవాలి జర్నలిస్టు నాగరాజు కోరారు.
● భూ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు రూ.లక్ష లంచం డిమాండ్ చేస్తున్నారని ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన వెంకటయ్య అనే రైతు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
● 503 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమి తమ సొంతమని వెంకటరంగారెడ్డి, పోతుగడ్డ రామాంజనేయులు అనే వ్యక్తులు 1994లో రెండు సెంట్ల చొప్పున తమకు విక్రయించి మోసగించారని మాజీ సైనిక ఉద్యోగి మురళీ నాయుడు, చిల్లా వెంకట సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు.