నల్లగొండ : చేయూత పథకం కింద కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగంగా కొనసాగుతోంది. సెర్ప్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రక్రియలో అక్టోబర్ 3 నాటికి జిల్లా వ్యాప్తంగా 32,993 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 32,991 దరఖాస్తులను ట్యాగ్ చేసి ప్రాసెస్ చేశారు. క్షేత్రస్థాయిలో అర్హత పరిశీలనతో పాటు ఎంపీడీఓల స్థాయిలో ఆమోద ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు త్వరగా అందేలా అధికారులు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
29 వేలకుపైగా అర్హత..
వీఓల స్థాయిలో జరిగిన క్షేత్ర పరిశీలనలో 29,056 దరఖాస్తులు అర్హమైనవిగా తేలాయి. మరో 3,382 దరఖాస్తులు అనర్హమైనవిగా గుర్తించారు. 462 దరఖాస్తులు హోల్డ్‌లో ఉండగా, 91 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంపీడీఓల స్థాయిలో ఇప్పటివరకు 25,355 దరఖాస్తులకు ఆమోదం లభించింది. 1,570 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరో 5,513 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.
నల్లగొండలో అత్యధికంగా దరఖాస్తులు..
మున్సిపాలిటీలు, మండలాల వారీగా పరిశీలిస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అత్యధికంగా 2,430 దరఖాస్తులు నమోదయ్యాయి. తర్వాత మిర్యాలగూడ మున్సిపాలిటీలో 1,560, కట్టంగూర్ మండలంలో 1,354, మిర్యాలగూడ మండలంలో 1,351 దరఖాస్తులు వచ్చాయి. నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 190 దరఖాస్తులు వచ్చాయి. అడవిదేవులపల్లి, గుడిపల్లి మండలాల్లో 269 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన, ఆమోద ప్రక్రియ పూర్తయ్యాక అర్హులైన లబ్ధిదారులకు చేయూత పథకం ప్రయోజనాలు అందనున్నాయి.
ఫ వివిధ స్థాయిల్లో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ఫ అర్హులకు ప్రయోజనం అందించేలా వేగంగా సాగుతున్న ప్రక్రియ
చేయూత దరఖాస్తుల వివరాలు ఇలా..
వచ్చిన మొత్తం దరఖాస్తులు 32,993
అర్హుత ఉన్నవిగా వీఓలు తేల్చినవి 29,056
ఎంపీడీఓల స్థాయిలో
ఆమోదం పొందినవి 25,355
పరిశీలనలో ఉన్నవి 5,513
తిరస్కరించినవి 1,570


