నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ హైవేలపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్, క్రేన్, హెల్పర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, 26 మంది అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ నిరంతరం రోడ్డు భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. జంక్షన్ల వద్ద ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిర్యాలగూడ–నందిపాడు, చిట్యాల–నార్కట్‌పల్లి, కొండమల్లేపల్లి–ఆలగడప, డిండి–కొండపల్లి, నార్కట్‌పల్లి–వాడపల్లి మార్గాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. దామరచర్ల రైల్వే బ్రిడ్జి, లైటింగ్ ఏర్పాటు చేయాలని, కట్టంగూర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో రోడ్ల ఆక్రమణలను తొలగించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో ట్రామా కేర్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు సీఎస్‌ఆర్ నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోకి లారీల రాకపోకలకు సమయపాలన విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సమావేశంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శ్రీవాణి, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ పాల్గొన్నారు.
కలెక్టర్ చంద్రశేఖర్


