దేవరకొండ : దేవరకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి అనిత చొరవతో ఓ నిరుపేద వితంతువుకు ఎట్టకేలకు పింఛన్ మంజూరైంది. పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన దంపతులు పోలగోని అచ్చమ్మ, కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. అచ్చమ్మ భర్త ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అచ్చమ్మ పేరిట ఎలాంటి భూమి లేదు. వితంతు పింఛన్ కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో గతేడాది ఆమె దేవరకొండ కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. దరఖాస్తును పరిశీలించిన న్యాయమూర్తి అనిత.. ఆమెను అర్హురాలిగా గుర్తించి, పింఛన్ మంజూరు చేయాలని పీఏపల్లి ఎంపీడీఓ ద్వారా కలెక్టర్‌కు ప్రత్యేక సిఫార్సు (స్పెషల్ రిక్వెస్ట్) చేశారు. విచారణ చేపట్టిన అధికారులు అచ్చమ్మకు పెన్షన్ మంజూరు చేశారు. శనివారం దేవరకొండ కోర్టు ఆవరణలో అచ్చమ్మకు పోస్టాఫీస్ పింఛన్ బుక్‌ను జడ్జి అందజేశారు. న్యాయపరమైన సమస్యలు ఉంటే న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చని జడ్జి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కేవీఎస్ హరీష్‌బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్నేహ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి ఉమామహేష్, వనం జగదీష్, న్యాయవాదులు శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌గౌడ్, రమేష్, రియాజుద్దీన్, రాములు, రవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


