ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ పనుల్లో వేగం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ పనుల్లో వేగం

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

రైతులకు ఎంతో ప్రయోజనం

పామాయిల్‌ క్రషింగ్‌ యూనిట్‌ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇతర నిర్మాణ పనులన్నింటినీ మిషనరీ బిగింపు పనులన్నింటినీ త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది మార్చి నుంచి పామాయిల్‌ క్రషింగ్‌ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనివల్ల పామాయిల్‌ తోటలు ఉన్న రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది.

– యాదగిరి, డీజీఎం ప్లాంటేషన్‌ తెలంగాణ యూనిట్‌

నల్లగొండ అగ్రికల్చర్‌: అనుముల మండలం యాచారం గ్రామంలో పతంజలి ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆయిల్‌ పామ్‌ క్రషింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో, 39 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచ్చేలా అధికారులు పనుల్లో వేగం పెంచారు.

రైతులకు తప్పనున్న కష్టాలు..

సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో పామాయిల్‌ తోటలు సాగవుతుండగా, ప్రస్తుతం అవి కాపు దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాంత రైతులు తమ పామాయిల్‌ గెలలను విజయవాడ సమీపంలోని అంబాపురం ఫ్యాక్టరీకి తరలించి విక్రయించాల్సి వచ్చేది. యాచారంలో ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రైతుల రవాణా వ్యయం, కష్టాలు తప్పుతాయి. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఈ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. భూముల ధరల కారణంగా కొంత జాప్యం జరిగింది. అయితే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పతంజలి సంస్థపై ఒత్తిడి తీసుకురావడంతో రెండు నెలల క్రితం పనులు తిరిగి ఊపందుకున్నాయి.

పాసెసింగ్‌ యంత్రాలు వచ్చాయి

వచ్చే ఏడాది మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాసెసింగ్‌ ప్రారంభించాలని కలెక్టర్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో గంటకు 15 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం గల ఈ యూనిట్‌ సివిల్‌ పనులను సంస్థ ముమ్మరం చేసింది. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, ప్రాసెసింగ్‌కు సంబంధించిన యంత్రాలు సైట్‌కు చేరుకున్నాయి. త్వరలోనే మిషనరీ బిగింపు పనులు చేపట్టనున్నారు.

టన్ను ధర రూ. 23,700

ప్రస్తుతం మార్కెట్‌లో పామాయిల్‌ గెలకు టన్నుకు రూ.23,700 వరకు పలుకుతోంది. ప్రస్తుతం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పామాయిల్‌ తోటల నుంచి దాదాపు పదివేల టన్నుల దిగుబడి వస్తోందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఐదు వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేయించాలని జిల్లా ఉద్యానవన శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రభుత్వ రాయితీలు అందించడం, స్థానికంగానే ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుండటంతో రైతులు సైతం ఈ సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు.

స్థానికులకు ఉపాధి అవకాశాలు

ఈ క్రషింగ్‌ యూనిట్‌ నిర్మాణం పూర్తయితే యాచారం, పరిసర గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 100 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. టెక్నికల్‌, నాన్‌–టెక్నికల్‌ విభాగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇచ్చేందుకు పతంజలి ఫుడ్స్‌ లిమిటెడ్‌ సన్నద్ధమవుతోంది.

కొనసాగుతున్న ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ పనులు

ప్రాసెసింగ్‌ యంత్రాలు, ఇతర సామగ్రి

ఫ రూ.100 కోట్ల వ్యయంతో, 39 ఎకరాల్లో ఏర్పాటు

ఫ గంటకు 15 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం

ఫ వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి..

ఫ పామాయిల్‌ రైతులకు

తప్పనున్న రవాణా కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement