రెండేళ్లలో ‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో ‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తిచేస్తాం

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తిప్పర్తి: రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మార్గం పనులు పూర్తి చేసి, జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం తిప్పర్తి మండలంలోని పజ్జూరు, యర్రగడ్డలగూడెం, వెంకటాద్రిపాలెం, ఇండ్లూరు, మామిడాల, గోదావరిగూడెం, ఎల్లమ్మగూడెం గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పజ్జూరు గ్రామంలో రూ.30కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. యర్రగడ్డలగూడెంలో విద్యుత్‌, డ్రెయినేజీ, తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో రూ.3కోట్లతో సబ్‌స్టేషన్‌ మంజూరు చేస్తామని తెలిపారు. బోర్లు వేయిస్తామని, డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా వెంకటాద్రిపాలెంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇండ్లూరులో రూ.50లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మామిడాలలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కర ణ్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఈఈ గిరిధర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మోహన్‌, ఈఈ శ్రీధర్‌రెడ్డి, జిల్లా, మండల స్థాయి నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

కలసికట్టుగా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి

రామగిరి (నల్లగొండ): కలసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మండలం పావురాలగూడెంలో రూ.1.35 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. చిన్న సూరారం మహిళా సంఘాలకు రూ.3 కోట్లు, పెద్ద సూరారానికి రూ. 2.5 కోట్లు, చందనపల్లి సంఘాలకు రూ. 1.5 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్న సూరారం – పెద్ద సూరారం గ్రామాల మధ్య గోదాం లేదా రైస్‌ మిల్లు నిర్మాణం కోసం 5 నుంచి 10 ఎకరాల స్థలాన్ని సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. పావురాలగూడెంలో చౌకధరల దుకాణాన్ని మంజూరు చేస్తూ, తక్షణమే డీలర్‌ను నియమించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌ కరణ్‌ రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు లక్ష్మయ్య, గుమ్మల మోహన్‌ రెడ్డి, విజిలెన్స్‌ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, తహసీల్దార్‌ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement