మర్రిగూడ: పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన ఘటన మర్రిగూడ మండలంలోని ఖుదాబాక్షపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంత మల్లేష్ పంచాయతీ కార్యదర్శి ప్రసన్నబాబు సంతకాన్ని ఫోర్జరీ చేశారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి గ్రామ కంఠానికి చెందిన 188 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కార్యదర్శి ప్రసన్నబాబు తన సంతకం ఫోర్జరీ చేయడంపై శనివారం మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.
సర్వేకు సహకరించాలి
మునుగోడు: ప్రభుత్వ, ప్రైవేట్ భూముల వివాదాలను పూర్తిగా పరిష్కరించేందుకు చేపట్టిన భూ రీసర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో చేపడుతున్న రీసర్వేను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై రీసర్వేతో కలిగే లాభాలను వివరించారు. రీసర్వే తో ప్రతి రైతు భూమికి హద్దులు పక్కాగా నిర్ణయించబడతాయన్నారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైతే కొనేళ్ల కాలంగా కబ్జా కలిగి సాగుచేసుకుంటున్నారో వారికే హక్కులు దక్కుతాయని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఆస్తికి పక్కాగా హద్దులు నిర్ణయించబడతాయన్నారు. సమావేశంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ నరేష్, ఆర్‌ఐ వంశీప్రసాద్, సర్వేయర్ అరుణజ్యోతి, జీపీఓ లింగయ్య, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
మరమ్మతులు చేపట్టాలి
డిండి: మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం–1 లో పెచ్చులూడిన ప్రదేశమంతా వెంటనే మరమ్మతులు చేపట్టాలని, పనులు పూర్తయ్యేంత వరకు విద్యార్థులను ఇతర భవనానికి మార్చాలని జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి శనివారం దేవరకొండ సీడీపీఓకు ఆదేశాలు జారీ చేశారు. ‘శిథిల భవనం.. భయం భయం’ అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా సంక్షేమ అధికారులు స్పందించారు. డిండిలోని అంగన్‌వాడీ కేంద్రం – 1 భవనానికి మరమ్మతులు చేపట్టడంతోపాటు దర్గా బజారులో అద్దె భవనంలో కొనసాగుతున్న మరో అంగన్‌వాడీ కేంద్ర నూతన భవన ఏర్పాటుకు పంచాయతీరాజ్ ఇంజనీర్‌తో సమన్యయం చేసుకుని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
మూసీకి 1203
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శనివారం ఎగువ నుంచి మూసీకి 1203 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ఈ సీజన్‌లో మూసీ ప్రాజెక్టుకు వెయ్యి క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో రావడం ఇదే మొదటి సారి. ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. శనివారం సాయంత్రం నీటిమట్టం 638.30 అడుగులకు చేరుకుంది. పంటల సాగు కోసం మూసీ కుడి, ఎడమ కాల్వకు 325 క్యూసెక్కుల చొప్పున మొత్తం 650 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.84 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.


