1.80 ఓట్లు తొలగింపే! | - | Sakshi
Sakshi News home page

1.80 ఓట్లు తొలగింపే!

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

లక్షల

నల్లగొండ, మిర్యాలగూడ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ చివరి దశకు చేరింది. ఎన్యుమరేషన్‌ ఫారాలు బీఎల్‌ఓలకు అందిచేందుకు ఆగస్టు 3వరకు గడువు ఉండగా.. ఆలోగానే డిజిటలైజేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఇప్పటి వరకు జిల్లాలో 87.93 శాతం ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా ఫారాలు తిరిగి తీసుకోవడంతో పాటు వాటిని ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. కొందరికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో రెండు చోట్లా ఓట్లు ఉండడంతో వాటిని సరిచేసి ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయితే ముసాయిదా జాబితాలోంచి సుమారు 1.80 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉంది.

13,33,184 మంది వివరాలు డిజిటలైజేషన్‌

జిల్లాలో 15,16,253 మంది ఓటర్లలో 13,33,184 మంది (87.93శాతం) వివరాలను బీఎల్‌వోలు ధ్రువీకరించారు. ఈ ప్రక్రియలో వేలాది మంది ఓటర్లు మరణించడం, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారడం, మరోచోట ఓటు నమోదు చేసుకోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా పరిశీలించిన వివరాల ప్రకారం 30,169 మంది ఓటర్లు మరణించినట్లు, 67,412 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినట్లు గుర్తించారు. అలాగే 15,047 మంది ఇప్పటికే మరోచోట ఓటర్లుగా నమోదు అయ్యారు. వీరితో పాటు 3,223 మంది అసలు రెమ్యునరేషన్‌ ఫారం తీసుకునేందుకు ఇళ్ల వద్దే లేరు. 218 మంది ఇతర కారణాల కింద నమోదయ్యారు. మరో 67,000 మంది రెమ్యురేషన్‌ ఫారాలు ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అన్నింటిని పరిశీలించి ఈ ఓట్లను తొలగించే అవకాశం ఉంది.

నాగార్జునసాగర్‌ ముందంజ

జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్‌, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, మునుగోడు నియోజవర్గాలు ఉండగా అందులో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం చేపట్టడంలో నాగార్జునసాగర్‌ ముందంజలో ఉంది. ఆ ప్రాంతంలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలు ఉండడం వల్ల సర్‌ ప్రక్రియలో విజయవంతంగా సాగింది. రెండవ స్థానంలో నకిరేకల్‌ నియోజకవర్గం ఉంది. మూడవ స్థానంలో మిర్యాలగూడ, నాలుగవ స్థానంలో దేవరకొండ, ఐదవ స్థానంలో నల్లగొండ, ఆరవ స్థానంలో మునుగోడు ఉన్నాయి.

మ్యాపింగ్‌ ప్రక్రియలో ఇబ్బందులు

సర్‌ ప్రక్రియ మొదలైన తరువాత 2002, 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్లను మ్యాపింగ్‌ చేయాల్సి ఉంది. 2002లో ఓటర్ల పేర్లు తప్పులు దొర్లడం వల్ల ఇప్పుడున్న ఓటర్లు ఆ ఓటును మ్యాపింగ్‌ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఎన్యుమరేషన్‌ ఫారాలను డిజిటలైజేషన్‌ చేయడంలో బీఎల్‌ఓలకు సరైన అవగాహన లేకపోవడంతో తప్పుల తడకగా ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ చేస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో ఓటర్లకు నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై ఎన్నికల, రెవెన్యూ శాఖ అధికారులు సమగ్రంగా ఓటర్ల జాబితాను డిజిటలైజేషన్‌ చేస్తే బాగుంటుందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.

12 మండలాల్లో 90శాతం పూర్తి..

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో గల 37 మండలాల్లో అత్యధికంగా 90 శాతం డిజిలైజేషన్‌ ప్రక్రియ 12 మండలాల్లో పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మాడుగులపల్లి(నాగార్జునసాగర్‌ పరిధి) 94.98, గుడిపల్లిలో 91.04, గుర్రంపోడులో 90.48, , నిడమనూరు 90.35, తిరుమలగిరి(సాగర్‌) 91.31, మాడుగులపల్లి(మిర్యాలగూడ) 91.89, వేములపల్లి 91.89, చండూరు 92.43, గట్టుప్పల్‌ 91.04, మునుగోడు 91.88, చిట్యాల 92.33, కట్టంగూరులో 92.10 ఓటర్ల డిజిటలైజేషన్‌ పూర్తయింది.

జిల్లాలో 87.93 శాతం పూర్తయిన సర్‌ ప్రక్రియ

ఫ ఎన్యుమరేషన్‌ పూరించి ఇవ్వనివారు 67 వేల మంది

ఫ ఫారాలు ఇచ్చేందుకు వచ్చే నెల 3 వరకు గడువు

ఫ అన్నీ పరిశీలించి ముసాయిదా జాబితా సిద్ధం చేయనున్న అధికారులు

వివరాలు ఇలా..

మొత్తం ఓటర్లు

15,16,253

డిజిటలైజేషన్‌

13,33,184

(87.93%)

మృతులు

30,169

శాశ్వతంగా వలసలు

67,412

డబుల్‌ ఓటర్లు

15,047

శాశ్వతంగా షిఫ్ట్‌ అయినవారు, మృతుల వివరాలు ఇలా..

నియోజవర్గం శాశ్వతంగా షిఫ్ట్‌ మృతులు

నల్లగొండ 14,393 4,087

నాగార్జునసాగర్‌ 13,531 3,511

నకిరేకల్‌ 11,164 6,445

దేవరకొండ 10,810 6,911

మిర్యాలగూడ 10,169 4,837

మునుగోడు 7,345 4,378

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement