మున్సిపాలిటీల్లో ‘బిల్‌ వన్‌’ | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల్లో ‘బిల్‌ వన్‌’

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

భువనగిరిటౌన్‌ : మున్సిపాలిటీలోని ప్రజలకు పన్నుల చెల్లింపు సేవలు సులభతరం చేసేందుకు పురపాలక శాఖ నూతన సాంకేతిక పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు వేర్వేరుగా చెల్లించే ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుమును ఒక్కటిగా కలిపి ఒకే వేదికపై చెల్లించేలా బిల్‌వన్‌ పేరుతో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఇటీవల హైదరాబాద్‌లో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ టీకే.శ్రీదేవి లాంఛనంగా ప్రారంభించగా ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో బిల్‌ వన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఒకేసారి మూడు బిల్లులు చెల్లించేలా..

గతంలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు చెల్లించాలంటే వేర్వేరు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. కొత్తగా తెచ్చిన ‘బిల్‌ వన్‌’ ఏకీకృత విధానంతో మూడు రకాల బకాయిలు ఒక్క సమాచారంతోనే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఏకకాలంలోనే చెల్లించే వెసులుబాటు కలగడంతో వినియోగదారులకు సమయం, శ్రమ ఆదా కానున్నాయి.

వాయిదాల సదుపాయం.. శ్రమ తగ్గిన సిబ్బంది

ఏకీకృత బిల్లు మొత్తం ఒకేసారి చెల్లించడం భారం అనుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా చెల్లించే సదుపాయాన్ని కూడా కల్పించింది. అయితే, నిర్దేశిత గడువులోగా చెల్లించకపోతే నిబంధనల ప్రకారం పన్నుపై వడ్డీ భారం పడనుంది. మరోవైపు ఈ విధానం వల్ల మున్సిపల్‌ సిబ్బందికి కూడా ఊరట లభించింది. గతంలో ఒక్కో బిల్లు వసూలు కోసం వేర్వేరుగా ఇంటింటికి లేదా దుకాణాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇకపై ఒకేసారి ప్రక్రియ పూర్తి కానుందని అంటున్నారు. దీంతో మిగిలిన సమయాన్ని పట్టణ పారిశుద్ధ్యం, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించే అవకాశం లభించింది.

ఆన్‌లైన్‌లో చెల్లించే విధానం ఇలా..

● తెలంగాణ పురపాలక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని బీఎల్‌వన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

● మీ ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ లేదా అసెస్‌మెంట్‌కు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి.

● సెల్‌ ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్‌ చేయగానే, సదరు ఆస్తి లేదా షాపునకు సంబంధించిన ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు బకాయిల సమగ్ర వివరాలు కనిపిస్తాయి. అక్కడి నుంచే నేరుగా డిజిటల్‌ విధానంలో చెల్లింపు పూర్తి చేయవచ్చు.

ఫ ఒకేసారి ఇంటి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు చెల్లింపు

ఫ పన్నుల చెల్లింపు సులభతరం చేసేలా కొత్త విధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement