నల్లగొండ : బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లాలోని ముస్లింలకు బుధవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ ప్రతి ముస్లిం కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. కాగా నేడు నల్లగొండలో ఈద్గా వద్ద జరిగే బక్రీద్ వేడుకలకు మంత్రి హాజరు కానున్నారు.
పండుగను ప్రశాంతంగా
జరుపుకోవాలి : గుత్తా
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు బదిలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీ అయిన ఉద్యోగులకు జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పు రాంబాబు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
29న జాబ్‌మేళా
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఐటీఐ క్యాంపస్‌లో ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు జిల్లాలోని నిరుద్యోగ యువతకు పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించుటకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ :7893420435 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ధాన్యం దిగుమతికి
లారీల బారులు
కొండమల్లేపల్లి : మండల పరిధిలోని గుమ్మడవల్లి గ్రామ సమీపంలోని సాయిలక్ష్మీ పారా బాయిల్డ్ రైస్ మిల్లు వద్ద వరి ధాన్యం దిగుమతి (అన్ లోడింగ్) కోసం లారీలు రోడ్డుపై బారులుదీరాయి. ప్రస్తుతం మిల్లు ఎదుట రోడ్డుపై ఆరు లారీలు, మిల్లు లోపల 10కి పైగా లారీలు ధాన్యం లోడుతో దిగుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిలో కొన్ని లారీలు వారం క్రితం రాగా, మరికొన్ని మూడు రోజుల క్రితం, ఇంకొన్ని గత రాత్రి కురిసిన వర్షంలో తడుస్తూ ఇక్కడికి చేరుకున్నాయి. మిల్లులోని గోదాములు నిండిపోవడమే దిగుమతి ఆలస్యానికి ప్రధాన కారణమని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి త్వరగా ధాన్యాన్ని దిగుమతి చేయించాలని డ్రైవర్లు, రైతులు కోరుతున్నారు.
యాదగిరీశుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవను జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలను నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన పూజను చేపట్టారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవమూర్తులను అలంకరించి, వివిధ సుగ్రంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలు, తులసీ దళాలతో శ్రీస్వామి వారికి లక్ష పుష్పాలతో అలంకరించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులు, అధికారులు, సిబ్బందికి పుష్పాలను అందజేశారు.


