104 పథకంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సిబ్బందికి నెలనెలా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు అందించి ఆదుకోవాలి. అలాగే ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారిని జిల్లాకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
– బైరగోని భిక్షం, పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్,
(ఐఎన్‌టీయూసీ 3194) జిల్లా అధ్యక్షుడు
నల్లగొండ టౌన్ : ఔట్‌సోర్సింగ్ పద్ధతిన 104 పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 15 నెలలుగా వేతనాలు అందడం లేదు. గతంలో ఈ పథకాన్ని రద్దు చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందులో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాల్లో సర్దుబాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 75 మంది ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు మూడేళ్ల క్రితం వరకు పనిచేశారు. ఇందులో 15 మంది రెగ్యులర్ అయ్యాయి. అయితే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన తర్వాత 104 సేవలు అవసరం లేదని నిలిపివేసింది. దాంట్లో అందులో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగాం జిల్లాలోని ఆస్పత్రులు, పీహెచ్‌సీలలో సర్దుబాటు చేసి వారందరిని అక్కడ విధులను నిర్వహించాలని ఆదేశించింది. దీంతో వారందరూ తక్కువ వేతనాలు అయినప్పటికీ బతుకుదెరువు కోసం ఆయా జిల్లాల్లో విధులను నిర్వహిస్తున్నారు. ఇందులో రెండేళ్ల వరకు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసిన 60 మందిని డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్) పరిధిలోకి తీసుకున్నారు.
తక్కువ వేతనంతో వెట్టిచాకిరీ..
ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న 104 వాహన ఉద్యోగులకు విభాగాల వారీగా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనాలు ఉంటాయి. వేతనం తక్కువ అయినప్పటికీ విధిలేక ఇతర జిల్లాలో పనిచేస్తున్నా ప్రతినెలా ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు సుమారు పదిహేను నెలల నుంచి వేతనాలను ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా తాము బస్సు కిరాయిలు, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, కుటుంబ పోషణకు నెలనెలా అప్పులు చేసి నెట్టుకు వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలనెలా వేతనాలు అందేలా చూడాలని సిబ్బంది కోరుతున్నారు.
ఫ ఆర్థిక ఇబ్బందుల్లో 104 సిబ్బంది
ఫ పథకాన్ని రద్దు చేసినా ఇతర జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు
ఫ ప్రస్తుతం డీఎంఈ పరిధిలో
పనిచేస్తున్న 60 మంది


