నల్లగొండ : గ్రామాల అభివృద్ధితో గ్రామీణ జీడీపీ (గ్రామీణ స్థూల జాతీయోత్పత్తి) పెరుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ పంపు పనులు, మహిళా సూపర్ బజార్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, ఏపీఓలు, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా 1.23 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. జిల్లాలో 17 ఎంపీడలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ లక్ష్యాల సాధనలో అధికారులు చూపుతున్న కృషిని ప్రశంసించారు. జిల్లాలో 941 గ్రామ సమాఖ్య భవనాలు, 14 ఫుడ్ స్టోరేజ్ గోదాముల నిర్మాణం చేపట్టడం శుభపరిణామన్నారు. సమష్టి నాయకత్వంతో గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు.
ఆర్గానిక్ సాగువైపు అడుగులు వేయాలి
స్వయం సహాయక మహిళా సంఘాలు కూడా ఆర్గానిక్ సాగు వైపు అడుగులు వేయాలని దాన కిషోర్ సూచించారు. రాష్ట్రంలో 8,029 ధాన్యం కేంద్రాలను స్వయం సహాయక మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రెండేళ్లలో మహిళా సంఘాలకు రూ.65 వేల కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ కమిషనర్ లక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్


