నల్లగొండ : బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సమీప కాలనీల కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈద్గాలు, మసీదుల వద్ద తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ కె.శివరాంరెడ్డి, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నల్లగొండ ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అమేర్, ఎస్‌ఐలు సైదులు, లచ్చిరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నాలుగు గ్రామాల్లోవడగండ్ల వాన
శాలిగౌరారం : మండలంలోని వంగమర్తి, మాధారంకలాన్, ఇటుకులపహాడ్, పెర్కకొండారం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. అకాల వర్షం ధాటికి ఆయా గ్రామాల్లోని వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మాధారంకలాన్‌లో అత్యధికంగా గంటన్నర సేపు వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో వానాకాలం పంటల సాగుకు సిద్ధమయ్యే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యాదగిరీశుడి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేషపూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు చేశారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన జరిపారు. ఇక శ్రీస్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్యన నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


