విహారెడ్డి సాధించిన ఈ అంతర్జాతీయ విజయం వెనుక ఎన్నో కన్నీళ్లు.. అంతకుమించి కఠిన శ్రమ ఉన్నాయి. 2023లో జరిగిన ఒక టోర్నమెంట్‌లో ఆడుతున్న సమయంలో ఆమె కుడికాలికి గాయమైంది. గాయం నుంచి కోలుకోగానే పట్టుదలతో మళ్లీ సాధన మొదలు పెట్టింది. 2024లో జాతీయ పోటీల సమయంలో కాలి మడిమకు తీవ్ర గాయమైంది. ఆ గాయాన్ని జయించి రెట్టింపు పట్టుదలతో ఆటలోకి అడుగుపెట్టింది.
విహారెడ్డి భవిష్యత్‌లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ స్థాయిలో దేశానికి పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 23 వరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగే ఎఫ్‌ఐబీఏ ఆసియా కప్ అండర్–18 బాస్కెట్‌బాల్ టోర్నీలో భారతజట్టును విజేతగా నిలపడమే తన తదుపరి లక్ష్యమని విహారెడ్డి పేర్కొంది. రోజూ గంటల తరబడి సాధన చేస్తూ తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటోంది. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ప్రపంచ స్థాయిలో రాణించగలరని నిరూపిస్తోంది విహారెడ్డి.
ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో జరుగుతున్న దక్షిణాసియా క్వాలిఫయింగ్ అండర్–18 టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విహారెడ్డి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చింది. అంతకుముందు 2025 అక్టోబర్ బహ్రెయిన్‌లో నిర్వహించిన మూడో ఏసియా యూత్ గేమ్స్ బాస్కెట్‌బాల్ టోర్నీలోనూ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును విజయపథంలో నడిపించింది.


