క్వార్టుర్లు ఖాళీ చేయండి | - | Sakshi
Sakshi News home page

క్వార్టుర్లు ఖాళీ చేయండి

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

నోటీసుల వెనుక అసలు కారణమేమిటి?

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నోటీసులు

దశాబ్దాల క్రితమే ఈ క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని నివాసయోగ్యం కావని ఉన్నతాధికారులు నివేదికలు ఇచ్చి డిస్మెంటల్‌ చేయాలని సూచించారు. అయినప్పటికీ స్థానికులు తమ ఖర్చులతో మరమ్మతులు చేసుకుని ఇండ్లలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు నాగార్జునసాగర్‌ జలాశయంలో పూడిక తొలగింపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పనులకు వచ్చే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బందికి వసతి కల్పించేందుకు ఈ క్వార్టర్లను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఎన్నెస్పీ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే మేమే లక్షల రూపాయలు ఖర్చు చేసి నివాస యోగ్యంగా మార్చుకున్న ఇండ్లను ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎంతవరకు న్యాయమని అంటూ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇప్పటికే నివసిస్తున్న కుటుంబాలకు శాశ్వాత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని నందికొండ హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీలో దశాబ్దాలుగా నివాసముంటున్న కుటుంబాలకు ఇళ్లు ఖాళీ చేయాలంటూ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం క్వార్టర్లు కావాలని, నోటీసు అందిన వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వం తీసుకునే చర్యలకు నివాసులు బాధ్యులవుతారని పేర్కొనడంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ, కెనాల్స్‌, బండల క్వారీ, రైట్‌బ్యాంక్‌ ప్రాంతాల్లో సుమారు 4,800 క్వార్టర్లు నిర్మించారు. అప్పట్లో ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు, కార్మికుల నివాసం కోసం ఈఈ, ఏఈ, ఏ, బీ, హెచ్‌ టైపు క్వార్టర్లను ఏర్పాటు చేశారు. కాలక్రమేణా సుమారు ఏడు దశాబ్దాలు గడవడంతో అనేక క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకోగా కొన్ని పూర్తిగా కనుమరుగయ్యాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రసుతం హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీలే ప్రధానంగా మిగిలాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జీవో 58, 59 కింద అనేక క్వార్టర్లను నివాసితులకే విక్రయించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. పలువురు ప్రభుత్వానికి భారీ మొత్తాలు చెల్లించి రిజిప్ట్రేషన్‌ కూడా చేయంచుకున్నారు. మరికొందరు దరఖాస్తులు సమర్పించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ జీవోలను నిలిపి వేయడంతో ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. ఇదిలా ఉండగా పాత క్వార్టర్లు నివాసయోగ్యం కాకపోవడంతో స్థానికులు తమ సొంత డబ్బులుతో లక్షలాధి రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపట్టారు. కొందరు పూర్తిగా పాడైపోయిన ఇండ్లను కూల్చివేసి కొత్తగా నిర్మించుకోగా మరికొందరు పాత గోడలను ఆధారంగా చేసుకుని ఆధునిక స్లాబులు వేసుకోని రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆ ఇండ్లకు పాత క్వార్టర్ల రూపమే లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వాళ్లకు నోటీసులు ఇవ్వడం ఏంటి, ఏళ్ల తరబడి నివసిస్తున్న కుటుంబాలను ఒక్కసారిగా బయటకు వెళ్లమంటే ఎక్కడి వెళ్లాలని అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి నివాసితుడికి ఇండ్ల హక్కులు కల్పిస్తామని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం ఖాళీ చేయమంటూ నోటీసులు రావడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతుంది. ఇప్పటికే హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీల్లో సుమారు 50 కుటుంబాలకు నోటీసులు అందగా మరికొంత మందికి కూడా ఇవ్వడానికి అధికారులు సిద్దమవుతున్నటు సమాచారం.

ఫ నందికొండలో ఇళ్లకు అధికారుల నోటీసులు

ఫ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నివాసులు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇండ్లకు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం 50 ఇండ్లకు ఇచ్చాం. మరో 50 ఇండ్లకు ఇచ్చేందుకు సమాయత్తమయ్యాం.

– ఏఈ విమల

Advertisement
 
Advertisement
Advertisement