నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు వినతులు ఆయనకు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ వాటిని పరిష్కరించాలని పోలీస్ అధికారులుకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆవిర్భావ దినోత్సవాన్ని పండువలా జరుపుకోవాలి
నల్లగొండ టౌన్ : ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మాదిగ జాతి పండుగలా జరుపుకోవాలని ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ అన్నారు. నల్లగొండలోని టీఎన్‌జీవోస్ భవనంలో సోమవారం నిర్వహించిన ఆయన మాట్లాడారు. తెలంగంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్నందున 9 శాతం రిజర్వేషన్ సదుపాయాలు మాదిగలు ఉపయోగించుకోవాలన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో నూతన జెండా గద్దెలను నిర్మించుకోవాలన్నారు. జూలై 7న మాదిగ జాతి పండుగగా జెండా పండుగ చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, జానకి రామయ్యచౌదరి, మల్లెపాక వెంకన్న, తరి ఏడుకొండలు, కురుపాటి కమలమ్మ, ఆడెపు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
మేథమెటిక్స్ ప్రోగ్రాంకు ఎన్జీ విద్యార్థినుల ఎంపిక
రామగిరి(నల్లగొండ): సమ్మర్ స్కూల్ ఫర్ ఉమెన్ ఇన్ మేథమెటిక్స్ ప్రోగ్రాంకు నల్లగొండ ఎన్జీ కాలేజీలో డిగ్రీ సెంకడ్ ఇయర్ చదువుతున్న కె. నవ్య, జె.శిరీష ఎంపికయ్యారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మేథమెటిక్స్ అండ్ కమిటీ ఫర్ ఉమెన్ ఇన్ మేథమెటిక్స్ సౌజన్యంతో ఇండియన్ ఉమెన్ అండ్ మేథమెటిక్స్ సహకారంతో హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్‌లో జూన్ 22 నుంచి జూలై 2వ తేదీ వరకు ఈ శిక్షణ జరగనుంది. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు గణితం సబ్జెక్టుపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ఉద్దేశం. ఐఐటీ, వివిధ రాష్ట్రాల సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించగా.. తెలంగాణ నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎన్జీ కాలేజీ నుంచి ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, మేథమెటిక్స్ హెచ్‌ఓడీ వెంకట్ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ మధుకర్, కనకయ్య, మతిన్ హుస్సేన్, బాల కార్తీక్ విద్యార్థినులను అభినందించారు.
అకాల వర్షం..
రైతులకు నష్టం
మర్రిగూడ : అకాల వర్షంతో అన్నదాతలు అతలాకుతలమయ్యారు. సోమవారం సాయంత్రం మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం కారణంగా రాంరెడ్డిపల్లి గ్రామంలో నక్క శ్రీనివాస్‌యాదవ్, నక్క బుగ్గరాములుతోపాటు రాజాపేటతండాకు చెందిన రాజయ్యకు పశువులపాకలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలగోని యాదయ్య, వడ్డె రమేష్‌కు చెందిన మామిడి, నిమ్మ చెట్లు నేలకొరిగాయి. అదేవిధంగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, రహదారుల వెంట ఉన్న చెట్లు కూలిపోయాయి. మర్రిగూడ, శివన్నగూడ, ఖుదాబాక్షపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
కె.నవ్య
జె.శిరీష


