నల్లగొండ : అయ్యా.. మా గోడు వినండి.. గోస తీర్చండి అంటూ పలువురు బాధితులు కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. గ్రీవెన్స్‌లో రెవెన్యూ శాఖకు 46, ఇతర శాఖలకు 57.. మొత్తం 103 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి పకడ్బందీగా నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరిస్తే ప్రజలకు సులభంగా ఉంటుందన్నారు. ప్రజావాణి ఫిర్యాదులతో పాటు, సీఎం కార్యాలయం నుంచి వచ్చినవి, ఇతర ఫిర్యాదులను ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య అతిథి సందేశానికి అవసరమైన నివేదికలను ఆయా శాఖలు తక్షణమే సీపీఓకు సమర్పించాలని చెప్పారు. అనంతరం యూనిక్ డిజెబిలిటీ ఐడీపై రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, సీపీఓ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రజావాణిలో బాధితుల వినతులు
ఫ ఫిర్యాదులు పరిష్కరించాలి : కలెక్టర్


