నల్లగొండ : రాష్ట్రంలోనే అత్యధికంగా 937 గ్రామ మహిళా సమాఖ్య భవనాలకు స్థల సేకరణ చేసి, 48 భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు నల్లగొండ జిల్లా మహిళా సమాఖ్యను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా 8 వేల మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నల్లగొండ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవితో మాట్లాడారు. నెల రోజుల్లోనే 937 భవనాలకు స్థల సేకరణ ఎలా చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ జిల్లాలో 38 మండల సమాఖ్యలు, 1144 గ్రామ సమాఖ్యలు, మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలతో వేగంగా స్థల సేకరణ పూర్తి చేశామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఉద్యోగాలు, ఉపాధి, విద్య కోసం వెళ్లే వారికి ఎంతో మేలు చేకూరుతోందని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఉచిత బస్సు పథకం వల్ల బాలికల చదువు మధ్యలో మానేసే పరిస్థితులు తగ్గాయన్నారు. గ్రామ సమాఖ్య సమావేశాల్లో పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయం, ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పెట్రోల్ బంకులు, గోదాములు, మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


