ఇంకుడు గుంతల నిర్మాణాలపై ప్రభుత్వం నజర్
ఇంకుడుగుంత నిర్మించుకుని నీటిని ఒడిసి పట్టుకుంటే నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది. 200 గజాల విస్తీర్ణం దాటిన నివాస, వాణిజ్య భవనాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండాలి. వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇంకుడు గుంత లేనివారికి నోటీస్‌లు జారీ చేస్తున్నాం.
– బి.శరత్‌చంద్ర, నల్లగొండ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
నల్లగొండ టూటౌన్ : వర్షాలు కురిసినప్పుడు వరద నీరు వృథాగా పోకుండా నీటిని ఒడిసి పట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్యలు రాకుండా ఉంటాయని ప్రభుత్వం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నల్లగొండ నగరంతోపాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాల్లో 200 గజాలకుపైగా విస్తీర్ణంలో ఇల్లు నిర్మించిన వారు తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలనే నిబంధన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ పట్టణాల్లో మున్సిపల్ యంత్రాంగం ఇంకుడు గుంతల లెక్క తీస్తున్నారు. ఇంకుడు గుంతల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్మించుకోని ఇళ్ల వారికి ఇంకుడు గుంత తీయాలని మున్సిపల్ సిబ్బంది నోటీసులు జారీ చేస్తున్నారు.
నీటి ఎద్దడి రాకుండా..
వేసవి కాలం దాటగానే సకాలంలో వర్షాలు పడకుంటే పట్టణాల్లో నీటి ఎద్దడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పలుసార్లు పట్టణాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగు నీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రధానంగా 200 గజాల విస్తీర్ణం దాటిన భవనాలు, అపార్ట్‌మెంట్‌లు, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య దుకాణాల సముదాయాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు తీయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంకుడు గుంతలు ఎన్ని ఉన్నాయి. లేనివి ఎన్ని భవనాలు ఉన్నాయనే వివరాలను మున్సిపల్ సిబ్బంది సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
70 శాతం వరకు భారీ భవనాలున్నా..
మున్సిపాలిటీల్లో ఇంకుడు గుంతలు తీయాలనే నిబంధన కచ్చితంగా ఉంటుంది. గత పుష్కర కాలం నుంచి వర్షాలు భారీగానే కురువడంతో ఇంకుడు గుంతలపై ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసింది. కొన్నేళ్ల నుంచి చేపట్టిన నిర్మించిన భవనాల్లో ఇంకుడు గుంతలు చాలా తక్కువ మంది తీసినట్లు మున్సిపల్ యంత్రాంగం పరిశీలనలో వెల్లడవుతుంది. దాదాపు 70 శాతం మంది భారీ భవనాలు ఉన్నా ఇంకుడు గుంతలు మాత్రం తీయించలేదు. దాంతో 200 గజాలు దాటిన భవనాలు, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా వాటిల్లో ఇంకుడు గుంతలు లేవనే చెప్పాలి.
కాంక్రీట్ నిర్మాణంతో
తగ్గిన భూగర్భ జలాలు..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంక్రీట్ నిర్మాణాలు భారీగా పెరిగిపోయాయి. ప్రధాన రహదారులతో పాటు ప్రతి కాలనీల్లో కాంక్రీట్ రోడ్లు వేశారు. కాలనీల్లో ప్రజలు కూడా తమ భవనాలు ముందు శుభ్రంగా ఉండేలా సిమెంట్‌తో ఫ్లోరింగ్ చేయించుకున్నారు. భారీ వర్షాలు కురిసినా వరద నీరు దిగువకు వెళ్తుంది తప్ప భూమిలోకి ఇంకిపోయే పరిస్థితులు లేక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇళ్లలోనూ బోర్లు సైతం ఎండిపోతున్నాయి. దాంతో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు, ఆవశ్యకత గురించి ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫ పట్టణాల్లో లెక్కలు తీస్తున్న మున్సిపల్ యంత్రాంగం
ఫ 200 గజాల విస్తీర్ణం దాటిన ఇంట్లో విధిగా నిర్మించుకోవాలని నిబంధన
ఫ నిర్మించుకోని వారికి నోటీసులు జారీ


