జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

మిర్యాలగూడ టౌన్‌ : బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ జి.అంజయ్య, అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రశాంత్‌ పిలుపునిచ్చారు. జూన్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌కు జిల్లా జట్టును ఎంపిక కోసం ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపు ప్రాంగణంలోని ఇండోర్‌ స్టేడియంలో తలపెట్టిన బ్యాడ్మింటన్‌ పోటీలను వారు అధికారికంగా ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారుల్లో పట్టుదల, నిరంతర కృషి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతారన్నారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జూన్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి నవీన్‌కుమార్‌, జాయింట్‌ సెక్రటరీ గంజి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు మధుబాబు, సికిందర్‌, కోశాధికారి శరన్‌కుమార్‌, జిల్లా కోచ్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

వైభవంగా యాదగిరీశుడి నిత్యకల్యాణ వేడుక

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో నిత్యకల్యాణ వేడుకను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆదివారం వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేశారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ జరిపించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు ఊరేగించారు.

మట్టపల్లిలో నిత్యపూజలు

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామి అమ్మవార్లకు అర్చకులు నిత్యపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలో మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం నిర్వహించి గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగించారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement