శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టులోకి ఆదివారం ఎగువ నుంచి మూసీ నది వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీ నదిపై యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ వద్ద నిర్మించిన హెడ్ రెగ్యూలేటర్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టులోకి సుమారు 30 కిలోమీటర్ల పొడవు ఉన్న రాచకాల్వ ద్వారా వరదనీరు వచ్చి చేరుతోంది. 1,200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి సామర్థ్యంతో 6 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం 5 అడుగుల దిగువన నీటి నిల్వ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మూసీనది ద్వారా ప్రవహించే ఆ నీటిని పల్లివాడ హెడ్ రెగ్యులేటర్ ద్వారా శాలిగౌరారం ప్రాజెక్టులోకి ఇటీవలే మళ్లించారు. ఈక్రమంలో ప్రాజెక్టు రాచకాల్వకు అనుసంధానంగా ఉన్న రామన్నపేట, నార్కట్‌పల్లి, శాలిగౌరారం మండలాలకు చెందిన పలు చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తున్నాయి.


