సాగర్‌కు.. ఆదాయమేదీ! | - | Sakshi
Sakshi News home page

సాగర్‌కు.. ఆదాయమేదీ!

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

కాలనీలు, మిగులు భూములు మున్సిపాలిటీకి ఇవ్వాలని గత ప్రభుత్వం ఆదేశం

ఇప్పటికీ ఆస్తులు అప్పగించని ఎన్‌ఎస్పీ

సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్న సాగర్‌ కాలనీ వాసులు

నాగార్జునసాగర్‌ : నాగార్జున సాగర్‌ వాసులకు కష్టాలు తప్పడం లేదు. అక్కడి ఇళ్లలో నివాసం ఉంటున్నా.. అవి వారి సొంతం కాదని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఎలాంటి ప్రైవేట్‌ భూమి లేకపోవడంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరడం లేదు. నందికొండ మున్సిపాలిటీకి ఆదాయ వనరులను సమకూర్చేందుకు ఎన్నెస్పీ ఆస్తులైన నివాస ప్రభుత్వ క్వార్టర్లు, మిగులు భూములను అప్పగించాలని గత ప్రభుత్వం ఎన్నెస్పీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, అమ్రాబాద్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌, రెవెన్యూ అధికారులు గతంలో సంయుక్తంగా సర్వే కూడా నిర్వహించారు. ప్రభుత్వం మారడంతో అధికారులు ఆ ఊసే ఎత్తడం లేదు.

అప్పటి ప్రభుత్వం ఆదేశించినా..

65 ఏళ్లుగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాలనీలైన హిల్‌కాలనీ, పైలాన్‌ కాలనీల ప్రజలు ప్రాజెక్టు అధికారుల పాలనలో మగ్గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే జరిగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ తాము అధికారంలోకి వస్తే సాగర్‌ కాలనీలను మున్సిపాలిటీ చేస్తానని ప్రకటించారు. ఆ హామీ మేరకు నందికొండ పేరుతో మున్సిపాలిటీ చేశారు. ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ ఇండ్లన్నీ ఎన్నెస్పీవే. ప్రైవేట్‌ ఆస్తులేమీ ఉండవు. మున్సిపాలిటీకి ఎలాంటి ఆదాయ వనరులు లేవు. ఈ విషయాలను స్థానికులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్నెస్పీ క్వార్టర్లను, మిగులు భూములను మున్సిపాలిటీకి అప్పగిస్తే స్టాండెడ్‌ అద్దైలెనా వస్తాయని వాటిని అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.

రికార్డుల్లో 2,555.15 ఎకరాల విస్తీర్ణం..

కలెక్టర్‌ ఆదేశాల మేరకు మూడు శాఖల అధికారులు భూముల రికార్డులను పరిశీలించి సర్వే చేశారు. జీఓ ఎంఎస్‌ నంబర్‌ 783 అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ తేదీ 15 ఏప్రిల్‌ 1959లో నల్లగొండ కలెక్టర్‌కు 1612 ఎకరాల ఫారెస్ట్‌ భూములను అప్పగించారు. అనంతరం బండల క్వారీ దగ్గర మెమో నంబర్‌ 5587 ఫారెస్ట్‌ తేదీ 05 ఫిబ్రవరి 1966లో 381.29 ఎకరాలు అప్పగించారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి 3,104 ఎకరాలు అప్పగించారు. ఆ భూములు ప్రస్తుతం ఆ జిల్లా పరిధిలోకే వెళ్లాయి. హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ భూములు 525.12 ఎకరాలుగా గుర్తించారు. ఎర్త్‌డ్యాం, హాస్పిటల్‌, పార్కులు, రోడ్లు, కాలనీలు, ఆలయాలు, ప్రాజెక్టు పరిధిలోగల భూములన్నీ కలిపి 2,555.15 ఎకరాల విస్తీర్ణం రికార్డులో ఉంది. ఆనాడు జరిగిన సర్వే కొలతల్లో ఎంత భూమి తేలిందనేది ఏ అధికారి దగ్గరా సమాచారం లేదు.

రిజిస్ట్రేషన్‌ అయిన ఇళ్లకు ట్యాక్స్‌

మున్సిపాలిటీకి ఆధాయం సమకూరాలంటే ఇప్పటికే 58, 59 జీవో ప్రకారం రిజిస్ట్రేషన్‌ అయిన ఇళ్లకు మున్సిపాలిటీ ట్యాక్స్‌ వసూలు చేయాల్సి ఉంది. అలాగే రిజిస్ట్రేషన్‌ కాని ఇళ్లకు దరకాస్తు చేసుకున్న వారికి నోటీసులు అందజేసి ఆ జీఓ ప్రకారం నగదు చలానా రూపేనా కట్టించుకుని రిజిస్టేషన్‌ చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. రిజిస్టేషన్‌ కాగానే మున్సిపాలిటీకి ట్యాక్స్‌ చెల్లించనున్నారు. రిజిస్టేషన్‌ కాకున్నా మున్సిపాలిటీ నుంచి స్థానిక కాలనీల ప్రజలు సేవలను పొందుతున్న దృష్ట్యా కలెక్టర్‌ ఒక నిర్ణయం తీసుకుని భూములన్నింటినీ మున్సిపాలిటీకి అప్పగించి నివాసుల నుంచి ట్యాక్స్‌ వసూలు చేసేందుకు మార్గం సుగమం చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీంతో నివాసల మీద హక్కులు వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement