ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం
నల్లగొండ టూటౌన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ –2026లో సింగిల్ డిజిట్ (10)లోపు ర్యాంకు సాధించేలా నీలగిరి కార్పొరేషన్ దృష్టి సారించింది. నగరంలోని అన్ని కూడళ్లు, ప్రజా మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్ధాల శుద్ధి, మార్కెట్లు, పచ్చదనం, సుందరీకరణ తదితర వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మార్కులు కేటాయిస్తుంది. దాంతో మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం వీటిపై ప్రత్యేక నజర్ పెట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, శానిటేషన్ సిబ్బంది, వార్డు అధికారులు, మెప్మా ఆర్పీలతో ఇటీవల పలుసార్లు సమావేశం నిర్వహించి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు ప్రత్యేకతపై కమిషనర్ వివరించారు. ప్రతి ఉద్యోగి స్థానిక కాలనీల్లోని ప్రజలతో మమేకమై వారి ద్వారా పౌర సేవలపై ఆన్‌లైన్‌లో మున్సిపాలిటీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసేలా చూడాలని సూచించారు. మెరుగైన ర్యాంకు సాధించేలా ప్రజలను భాగస్వామ్యులను చేయడానికి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో ఫీడ్ బ్యాక్ ఆధారంగా..
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌పై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ర్యాంకులు ఇస్తుంది. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ నగరాలు, పట్టణాలు తీసుకున్న విధానంపై ప్రజలు ఆన్‌లైన్‌లో ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. పట్టణాల ప్రజలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్, మున్సిపల్, కార్పొరేషన్ కార్యాలయాలు ఇచ్చే రికార్డుల ఆధారంగానే మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షన్‌లో ర్యాంకులు వస్తాయి. దాంతో నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పక్కా ప్రణాళికతో ముందుకు పోతూ గతంలో కంటే మెరుగైన ర్యాంకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఫ మెరుగైన ర్యాంకు సాధించేలా కార్పొరేషన్ కృషి
ఫ ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న యంత్రాంగం
స్వచ్చ సర్వేక్షణ్‌లో కేంద్ర ప్రభుత్వం మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం. గతేడాదికంటే కచ్చితంగా మెరుగైన ర్యాంకు సాధించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా సహకరం అందించాలి. – శరత్‌చంద్ర,
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్


