జిల్లాలో 5,29,991 మంది రైతులున్నారు. అందరికీ పెట్టుబడి సాయం అందించడానికి రూ.624 కోట్ల నిధులు అవసరం. యాసంగి సీజన్‌కు సంబందించి మొదటి విడతలో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో రూ.303 కోట్ల జమ చేసింది. గతనెల 20న రెండో విడతలో రెండెకరాలలోపు రైతులకు రూ.268 కోట్లు అందించారు. ఇంకా రూ.53 కోట్లు జమ కావాల్సి ఉంది.
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్ పూర్తయినా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతు భరోసా అందలేదు. రెండెకరాల్లోపు రైతులకే పెట్టుబడిసాయం పరిమితమైంది. ఆపైన భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారన్న విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఎకరాకు రూ.6 వేల చొప్పున
గత ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. మొదట్లో ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున ెఅందించిన సర్కారు.. తర్వాత రూ.10 వేలకు పెంచింది. తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చాక నిధుల కొరత ఉందంటూ ప్రతి సీజను ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తామని పేర్కొంది. గత వానాకాలంలో రైతులందరికీ నిధులు జమయ్యాయి. కానీ యాసంగికి వచ్చేసరికి పథకం అమలులో జాప్యం జరుగుతోంది.
వానాకాలమైనా ఇస్తారా..
గతంలో రైతులు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వారు. రైతుబంధు పథకం వచ్చాక రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం కొంత తగ్గింది. అయితే ఈ పథకాన్ని అమలు చేయడంలో రెండేళ్లుగా జాప్యం జరుగుతోంది. దీంతో మళ్లీ అన్నదాతలు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి భరోసానే పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఇక వచ్చే వానాకాలం పెట్టుబడి సాయం ఉంటుందో ఉండదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికై నా చిత్తశుద్ధితో వ్యవహరించి పూర్తిస్థాయిలో రైతుభరోసా నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
ఫ పూర్తిస్థాయిలో అందని యాసంగి పెట్టుబడిసాయం
ఫ నిరాశలో అన్నదాతలు


