అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎండల తీవ్రత పెరుగనుండటంతో వాతావారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో ఇప్పటికే 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, అవి రానున్న మూడు నాలుగు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలో 44 డిగ్రీలకంటే ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆ రెండు రోజులు రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
ఇప్పటికే అల్లాడుతున్న జనం
గతంలో కంటే ఈసారి ఎండల తీవ్రత పెరిగింది. గాలిలో తేమ శాతం తగ్గింది. ఎండలతో ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఇంట్లో కూడా వేడిని తాళలేక ఏసీలు, కూలర్లు పెట్టుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. అయితే బుధ, గురువారాల్లో 44 డిగ్రీలకు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈనెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తే కూడా ప్రారంభం అవుతుండటంతో ఎండలు మండిపోయే పరిస్థితి ఉంటుందని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఇళ్ల వద్దే ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ఫ 44 డిగ్రీలు దాటనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
ఫ సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు అరెంజ్ అలర్ట్
ఫ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన
ప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ణ్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 12 గంటల్లోగా పనులు చూసుకోవాలి. బయటకు వెళ్లాలంటే గొడుగులు, టోపీలు, తెల్లని వదులైన దుస్తులు ధరించాలి. కూల్‌డ్రింక్స్, ఆయిల్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మజ్జిగ, చల్లని నీరు తాగాలి. ఉపాధి హామీ కూలీలు, బయటకు పని నిమిత్తం వెళ్లేవారు 12 గంటల్లోగా ఇళ్లకు చేరుకోవాలి. కిటికీలు, తలుపులు దగ్గరకు వేసుకుని ప్యాన్లు వేసుకోవాలి. ఉష్ణోగ్రత పెరిగితే పక్షవాతం వచ్చి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది. వడదెబ్బ వస్తే సమీప వైద్యులను సంప్రదించాలి. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను తీసుకోవాలి.
– డాక్టర్ మాతృ, డీసీహెచ్‌ఎస్, నల్లగొండ


